కేరళ రాష్ట్రంలో తెర వెనక జరుగుతున్న విద్యార్థి-రాజకీయాలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. కేరళలో జస్టిస్ పి.కె.షంసుద్దీన్ నేతృత్వంలోని స్వతంత్ర కమిషన్ ఒక నివేదికను విడుదల చేసింది. తిరువనంతపురంలోని యూనివర్శిటీ కాలేజీల్లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలలు తమ విద్యార్థి సంఘ కార్యాలయాలను ‘ఇడి మురి’ లేదా ‘హింసించే గదులు’ గా మార్చాయని కమిషన్ అభిప్రాయపడింది.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అనుబంధ విద్యార్థి సంఘం – స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) భావజాలంతో ఏకీభవించని విద్యార్థులను ఈ హింసించే గదుల్లోకి తీసుకువెళతారు, అక్కడ వారిని కొట్టడమే కాక, గాయపరుస్తారు.
విద్యార్థి సంఘ కార్యాలయాలలో శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్నామని కాలేజీలలో మొదటి సంవత్సరం విద్యార్థులు తమ అనుభవాలను కమిషన్ తో పంచుకున్నారు. సిపిఐ (ఎం)కు సుదీర్ఘ హింసాత్మక చరిత్ర ఉంది. అంతేకాకుండా దాన్ని ఎస్ఎఫ్ఐపై రుద్దింది. ఇది భారతదేశంలో విద్యార్థి రాజకీయాలను అపహాస్యం చేసింది. చాలా మటుకు ఫిర్యాదులు ఎస్‌ఎఫ్‌ఐపైనే ఉన్నాయి.
అంతేకాకుండా, తిరువనంతపురం యూనివర్శిటీ కాలేజీలో బి.ఎస్.సి విద్యార్థి ఎస్.నిఖిల అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన తరువాత ఈ కమిషన్ ఏర్పడింది.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమైన తరువాత కమిషన్ ఈ నివేదికను తయారు చేసింది.
కేరళలోని క్యాంపస్‌లలో కొనసాగుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలను అధ్యయనం చేసిన కమిషన్ నివేదికను కేరళ గవర్నర్‌కు సోమవారం సమర్పించింది. క్యాంపస్‌లో దారుణాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి చట్టబద్ధమైన అధికారాలతో ఒక అంబుడ్స్‌మన్‌ను నియమించాలని కమిషన్ తెలిపింది.
ఎస్.ఎఫ్.ఐ తీవ్రమైన నిరంకుశ విధానాలు కళాశాలల్లో చాలా అనర్థాలకు దారితీస్తున్నాయి. రాజకీయ నాయకుల మద్దతుతో క్యాంపస్‌లలో అల్లర్లు జరుగుతున్నాయని, కాలేజీలలో ఈ రాజకీయ ఘర్షణలు ఒక సాధారణ విషయంగా మారాయని ఆ నివేదిక పేర్కొంది.
జూలై 2019 లో, నలుగురు ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు తమ కళాశాలకు చెందిన సహ విధ్యార్థిపై కత్తి దాడి చేశారు. ఆ తరువాత వారిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఎస్.ఎఫ్.ఐ పట్ల వ్యతిరేకత మరింత పెరిగింది. ఇలాంటి భయానక వాతావరణాన్ని సృష్టించినందుకు సిపిఐ (ఎం) పార్టీ, అనుబంధ విద్యార్ధి సంఘాలు బాధ్యత వహించాలి.
ఎస్.ఎఫ్.ఐ తీవ్ర వామపక్ష భావజాలాన్ని అనుసరించనివారి, అంగీకరించని వారు బెదిరింపులు, ప్రాణాంతక దాడులను ఎదుర్కొంటున్నారు. వామపక్షవాదులైన అధ్యాపకులు వేధింపులు, హింసల ఫిర్యాదులను పట్టించుకోవడంలేదు.
వామపక్ష రాజకీయాలకు మన దేశంలో కాలం చెల్లింది. అయితే వామపక్ష ఉగ్రవాదం దేశంలోని పలు ప్రాంతాలను ప్రభావితం చేసింది. అయితే వామపక్ష మేధావులు చేసే నష్టం, విధ్వంసం ఉగ్రవాదానికి ఏమి తీసిపోదు.
వామపక్షాల ప్రభావం ఇప్పటికే దేశంలో చాలా తగ్గిపోయింది. తీవ్ర హింస, దుర్మార్గం అనే ఈ మార్గంలో వామపక్షాలు ఇలాగే కొనసాగుతుంటే కమ్యూనిస్ట్ పార్టీ, ఎస్.ఎఫ్.ఐ మరెంతకాలమో మనుగడ సాగించలేవు.
విభిన్న రాజకీయ భావజాలానికి కట్టుబడి ఉన్నప్పటికి వారి జీవితాలకు ముప్పు లేదని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులలో నమ్మకాన్ని కలిగించాలి.