Home Telugu Articles మావోయిస్టుల దూకుడు అడ్డుకట్టకై కేంద్రం వద్ద ‘సమాధాన్’ ప్రణాళిక

మావోయిస్టుల దూకుడు అడ్డుకట్టకై కేంద్రం వద్ద ‘సమాధాన్’ ప్రణాళిక

0
SHARE

మావోయిస్టుల దూకుడుకు అదే తీరుగా ‘సమాధానం’ ఇవ్వాలని దిల్లీలో జరిగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల, ఉన్నతాధికారుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునివ్వడం ఇపుడు చర్చనీయాంశమైంది. ఇలాంటి సమావేశాలు, సదస్సులు గతంలో ఎన్నో జరిగినప్పటికీ, ఈసారి మాత్రం మావోల కట్టడికి కఠిన చర్యలు తీసుకునే సమగ్ర ప్రణాళికను రూపొందించారు. అదే- ‘సమాధాన్’. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమన్వయంతో కలిసి, బహుముఖ వ్యూహంతో ముందుకు నడవాలని తీర్మానించారు. ముఖ్యంగా మావోల ఆర్థిక మూలాలపై గట్టి దెబ్బ తీయాలన్న నిర్ణయానికి వచ్చారు.

గత ఏడాది నవంబర్‌లో పెద్దనోట్ల రద్దుతో మావోల కార్యకలాపాలకు కొంత ఆటంకం కలిగినా, ఆ చర్య పూర్తిస్థాయిలో ప్రభావితం చేయలేదు. మావోలకు ని ధులు అందకుండా అడ్డుకట్ట వేయాలన్న దృఢ సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. హెలికాప్టర్లు, డ్రోన్లు ఉపయోగించి మావోయిస్టుల స్థావరాలపై విరుచుకుపడాలన్న ప్రతిపాదన చేశారు. గతంలోనూ ఇలాంటి ఆలోచన చేసినా, ఇప్పుడు దానికి ప్రాణప్రతిష్ఠ చేసారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా ఉపయోగించి సత్ఫలితాలు సాధించాలని హోం మంత్రి సూచన చేశారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో ఇజ్రాయిల్ అవలంబించే విధానం, సాంకేతిక పరిజ్ఞానంతో చొరవ ఇక్కడ కనిపించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది.

కేంద్ర హోంమంత్రి ప్రకటించిన ‘సమాధాన్’కు విస్తృతార్థం ఇలా ఉంది. ఎస్-అంటే స్మార్ట్ లీడర్‌షిప్.. చురుకైన నాయకత్వం, ఎ-అంటే అగ్రెసివ్ స్ట్రాటజీ.. దూకుడుగా వ్యూహరచన, ఎం-అంటే మోటివేషన్ అండ్ ట్రైనింగ్.. ప్రేరణ-శిక్షణ, ఎ-అంటే యాక్షనబుల్ ఇంటిలిజెన్స్.. ఆచరణాత్మక కార్యాచరణ నిఘా, డి-అంటే డ్యాష్‌బోర్డ్ బేస్డ్ ఇండికేటర్.. సూచీలు, హెచ్-అంటే హార్నెసింగ్ టెక్నాలజీ.. సాంకేతిక పరిజ్ఞానం పెంచడం, ఎ-అంటే యాక్షన్ ప్లాన్ ఫర్ ఈచ్ థ్రెట్.. ప్రతి ప్రమాదానికి సరైన కార్యచరణ, ఎన్-అంటే నో యాక్సెస్ టు ఫైనాన్స్…ఆర్థికానికి అడ్డుకట్ట.

ఇదీ ‘సమాధాన్’. ఈప్రకటనకు ముందే సిఆర్‌పిఎఫ్ కార్యాలయాన్ని కలకత్తా నుంచి చత్తీస్‌గఢ్‌కు మార్చారు. దాంతో మావోయిస్టులతో జరిగే ‘యుద్ధ్భూమి’కి జవాన్ల కేంద్ర నాయకత్వం దగ్గరగా ఉండే అవకాశం ఏర్పడింది. ఈ ఒక్క పరిణామంతో రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలను కొంత ఊహించవచ్చు. మావోయిస్టులను ఎదుర్కోవడంలో గతంలో జరిగిన తాత్సారానికి ఇక తావులేదన్న సంకేతాన్ని కేంద్రం బలంగా ఇచ్చింది. దాడి-ఎదురుదాడి గురించే కాక అభివృద్ధికి సైతం సమ ప్రాధాన్యమిచ్చారు. రోడ్లు నిర్మించడం, సెల్ టవర్లు ఏర్పాటు చేయడం, జవాన్లకు మెరుగైన సదుపాయాలు అందించడం వంటి అనేక అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. బయోమెట్రిక్ ఆయుధాలను ఉపయోగించాలన్న ప్రతిపాదన సైతం ముందుకొచ్చింది. వీటికి జిపిఎస్ ట్రాకర్స్‌ను ఏర్పాటు చేయడంతో మావోయిస్టులు దాడిలో వాటిని ఎత్తుకెళ్లినా అవి ఎక్కడున్నాయో జిపిఎస్ ద్వారా తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు ఇపుడు అంతగా లేకపోయినా ఏమరుపాటు పనికిరాదని కేంద్రం సూచించింది. ఏపి, తెలంగాణలకు ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో మావోల దూకుడు ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దుల్లోని చత్తీస్‌గఢ్‌లో సుకుమా జిల్లా వుండడం, అక్కడ తరచూ మావోల విధ్వంసం కొనసాగడంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచన చేసింది. ఒడిశా సరిహద్దులోని విశాఖ మన్యంలో మావోల అలజడి అపుడపుడూ కనిపిస్తుంటుంది. ఇటీవల మావోల మందుపాతర పేలి ఒక హోంగార్డు మరణించాడు. ఒడిశాలోని నారాయణపట్నం సమితిలో, విశాఖ జిల్లా ముచింగ్‌పుట్ మండలంలో రోడ్డువేసే యంత్రాలను మావోయిస్టులు, వారి సానుభూతిపరులు ధ్వంసం చేశారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో పోలీసులు ఆరుగురు మావోయిస్టు, జనశక్తి నక్సల్స్ మద్దతుదారులను ఇటీవల అరెస్టు చేశారు. తెలంగాణ సరిహద్దులోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఇటీవల పేల్చిన మందుపాతర వల్ల ఒక కమాండో మరణించగా, 12మంది గాయపడ్డారు. ఇలా పలు రాష్ట్రాల్లో ఎక్కడో అక్కడ మావోయిస్టుల హింసాత్మక సంఘటనలు కొనసాగుతునే ఉన్నాయి. చత్తీస్‌గఢ్, ఒడిశా, ఝార్ఖండ్, బిహార్‌లో పెద్దఎత్తున హింసకు మావోలు పాల్పడుతున్నారు.

ప్రజాస్వామిక వ్యవస్థలో ఇలాంటి హింసకు, విధ్వంసానికి తావులేదు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధిస్తామని చెబుతున్న మావోలు గెరిల్లా సైన్యాన్ని దండకారణ్యంలో రూపొందించడం సహించరాని విషయమని కేంద్రం భావిస్తోంది. గత ప్రభుత్వాల కన్నా మావోల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు కేంద్రం ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి అధికార బృందం ఏర్పాటైంది. అవసరమైన సూచనలు, సలహాలను ఈ బృందం కేంద్రానికి, వివిధ రాష్ట్రాలకు అందచేస్తోంది.

2050 సంవత్సరం నాటికి దిల్లీలోని ఎర్రకోటపై తమ జెండా ఎగురవేయాలన్న ప్రణాళికతో మావోయిస్టులు కదులుతుండగా, 2020 నాటికే వారిని పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హోం మంత్రి నిర్వహించిన తాజా సమావేశంలో ఆ విషయం ద్యోతకమైంది. హెలికాప్టర్లు, డ్రోన్లు, జిపిఎస్ సిస్టమ్, సెల్ టవర్లు, రోడ్ల నిర్మాణం, రేడియో టవర్లు ఏ ర్పాటు ఇవన్నీ ఒక రూపానికి వస్తున్నాయి. వీటి సమన్వయంతో రాజకీయ సంకల్పంతో మావోయిస్టుల ఆట కట్టిస్తామన్న విశ్వాసం కేంద్రంలో కనిపిస్తోంది. గతంలో రాజకీయ ప్రయోజనాల కోసం మావోయిస్టు వ్యతిరేక చర్యల్లో తాత్సారం కనిపించేది. ఇప్పుడు చత్తీస్‌గఢ్‌లో, మహారాష్టల్రో బి జెపి ప్రభుత్వాలు ఉండడం కేంద్రానికి బాగా కలిసివచ్చిన అంశం. ఎన్‌డిఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్‌లో ఉండడం వల్ల ఆ ప్రభుత్వం, ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అవరోధాలు సృష్టించకపోవడంతో ప్రణాళికల అమలు సజావుగా కొనసాగే వాతావరణం కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వం ఏర్పడి, స్థిరచిత్తంతో పాలన సాగిస్తున్న ఆదిత్యనాథ్ వల్ల కూడా కేంద్రానికి కలిసొచ్చిన అంశంగా భావించాలి. సార్క్ దేశాల్లో, ప్రపంచ దేశాల్లో భారత్ పట్ల సానుకూలత కనిపించడం అంతర్జాతీయంగా కలిసొస్తున్న మరో విషయం. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు కేంద్రం దీటుగా ‘సమాధానం’ చెప్పగలదన్న భావన కలుగుతోంది. ఈ భావనే సగం విజయంగా తలచవచ్చు.

-వుప్పల నరసింహం సెల్ : 99857 81799

(ఆంధ్రభూమి సౌజన్యం తో)