Home Telugu Articles సన్యాసులు.. సామాజిక విప్లవకారులు

సన్యాసులు.. సామాజిక విప్లవకారులు

0
SHARE

‘సన్యాసి’ అనగానే సర్వ సంఘ పరిత్యాగి, ముక్కుమూసుకుని జపం చేసుకునే వాడన్న భావన చాలామందిలో కనిపిస్తుంది. ఆమాట కొంత నిజమే కానీ, అందరూ అలాంటివారు కాదు. కొందరు సన్యాసులు గొప్ప విప్లవకారులు కావడం గర్వించదగ్గ విషయం. అలాంటి వారివల్ల సమాజం సమయానుకూలంగా ముందడుగేసింది. సన్యాసం అంటే జడత్వం కాదు, చైతన్యమని నిరూపించిన మహాపురుషులు ఎందరో ఉన్నారు. ప్రాథమికంగా సన్యాసి జ్ఞానానే్వషి. ఆ జ్ఞానం వైయక్తికం అయితే అది వ్యక్తిముక్తికి ఉపకరిస్తుంది. అదే జ్ఞానం సమష్టిపరమైతే సమాజం విముక్తి వైపు పయనిస్తుంది. ఈ తేడాను గమనించాలి. ఈ రెండుదారులు భారతదేశంలో కనిపించడం సంతోషకరం. రెండవ మార్గం వల్ల సమాజానికి ఎక్కువ ప్రయోజనం కలగడంతో ఆ మార్గంపై చర్చ ఎక్కువ జరగడం సహజం. అందరి దృష్టి అటు సాగడం స్వాభావికం.

రెండున్నర వేల సంవత్సరాల క్రితం సిద్ధార్థుడు సన్యాసం స్వీకరించి జ్ఞానం కోసం పరితపించి చివరకు బుద్ధుడుగా మారి సమాజంపై బలమైన ముద్రవేసిన విషయం తెలిసిందే. ఓ కొత్త దృక్పథం, కొత్త కోణం, విషయ అవగాహనలో మార్పు కనిపించడంతో చైతన్యం ఆనాడు తొణకిసలాడింది. అది ఒక సన్యాసి తీసుకొచ్చిన గొప్ప విప్లవమంటే అతిశయోక్తి కాదు. ఆరోజుల్లో వ్యక్తిముక్తికోసం సన్యసించినవారు అనేకులున్నారు. ఆత్మానందం కోసం జప తప మాచరించిన వారున్నారు. కానీ, బుద్ధుడు మరో మార్గంలో పయనించాడు. సంఘ నిర్మాణం చేశాడు. సంస్కరణలు తీసుకొచ్చాడు. జ్ఞానానికిగల శక్తిని చాటి చెప్పాడు. అది సమాజాభ్యున్నతికి ఎలా ఉపకరిస్తుందో రుజువు చేశాడు. ఓ కొత్త దారి చూపాడు.

అలనాటి సన్యాసి సిద్ధార్థుడి దగ్గర నుంచి 21వ శతాబ్దంలో సన్యాసి రామ్‌దేవ్ బాబా వరకు ఎందరెందరో మహానుభావులు సమాజ అభ్యున్నతికి పాటుపడ్డారు. తమ జీవితాలను సమాజ సంస్కరణలకు, ప్రజల ఆలోచనల్లో మార్పు తెచ్చేందుకు అర్పించారు. అరబిందో ఘోష్ లాంటి గొప్ప విప్లవకారుల్లోనూ ఈ ఆధ్యాత్మిక తత్వం, సన్యాసి గుణం ప్రబలంగా కనిపించడం మనం చూడవచ్చు. మన అల్లూరి సీతారామరాజు సన్యాసి అయ్యాకనే విప్లవ వీరుడయ్యాడు, తిరుగుబాటు శంఖం పూరించాడు. ఇది భారతదేశ ఆత్మ. ఇందులోనే దేశ ప్రజల మూలాలు కనిపిస్తాయి. వారి ఆకాంక్షలు, ఆలోచనలు అగుపిస్తాయి. ప్రజలు తమని తాము ఆ చర్యల్లో చూసుకున్నారు. ఈ ప్రాథమిక ఆధ్యాత్మికత, యోగా, జపం-తపం వంటివి తొలగించి విప్లవాలకు శ్రీకారం చుడితే అవి ఎంతోకాలం ముందుకు సాగలేదు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి.

శతాబ్దంన్నర క్రితం సన్యాసి స్వామి వివేకానందుడు ఆధ్యాత్మిక, సామాజిక, విద్యా, సేవారంగాల్లో తీసుకొచ్చిన విప్లవం, దాని ప్రభావం స్వల్పమైనదా? కాదు.. ఆయన తన వేదాంత, ఆధ్యాత్మిక జ్ఞానబలంతో ప్రపంచాన్ని కుదిపేశారు. భారతదేశానికి ఒక కొత్త దిశా నిర్దేశం చేశారు. తనకు పూర్వపు సన్యాసుల్లాగాక తన కాలానికి అనుగుణమైన అడుగులు వేయడంతో ఆయన మార్గం అపూర్వంగా వెలుగొందుతోంది. ఆయనతో భారతదేశ చరిత్ర కొత్తమలుపు తిరిగిందనడం అతిశయోక్తి కాదు. గత రెండున్నర వేల సంవత్సరాలకు పైగా భారత సమాజంలో ఈ చైతన్యం, జ్ఞానస్రవంతి అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంది, అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంది. ఇన్ని శతాబ్దాలపాటు ఈ చైతన్యం కొనసాగడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కొందరు దాన్ని తేలిగ్గా తీసుకుని బొక్కబోర్లపడిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది.

19వ శతాబ్దం నుంచి ప్రపంచంలో చోటుచేసుకున్న హింసాత్మక విప్లవాల వెనుక రాజ్యాధికార యావ కనిపిస్తుంది. అదే పరమావధిగా అవి కొనసాగాయి. కాని భారతదేశంలో రెండున్నర వేలు సంవత్సరాలుగా కొనసాగుతున్న విప్లవాల్లో, సన్యాసుల జ్ఞాన విప్లవాల్లో కేవలం సమాజ సేవ, మానవ కల్యాణం కనిపిస్తాయి. రాజ్యాధికార యావ గాని, ఏదో లబ్దిపొందాలన్న దుగ్ధగాని వాటిల్లో కనిపించదు. ఈ స్పష్టమైన తేడా, ఈ గుణాత్మకమైన వ్యత్యాసంతోనే సన్యాసుల విప్లవాలు ఉన్నతంగా నిలుస్తున్నాయి. మానవ హననం చేసి అనంతరం మానవ కల్యాణం గూర్చి ఆలోచిస్తామనే వైఖరి, విధానం, ధోరణి విప్లవంగా వికసించదు. ఈ బలహీనతను ఇప్పటికీ కొందరు విప్లవకారులు గమనించక పోవడం విచిత్రం.. విడ్డూరం. బలప్రయోగం చేసి రాజ్యాధికారం దక్కించుకోవడమే విప్లవమన్న భావన చాలా ముతకమైనది. ఆ పద్ధతిలో రాజ్యాధికారం దక్కించుకున్నా అద్భుతమేదీ జరగలేదు. శవాల దిబ్బలు పెరగడం తప్ప. అలాంటి దిబ్బలు మరిన్ని ఏర్పాటు చేసేందుకు ఎవరు ప్రయత్నించినా వారు నిందనీయులే.

ఒక శిశువు రాత్రికిరాత్రే యవ్వనుడుగా మారడు. అదే తరహాలో సమాజం రాత్రికి రాత్రే తలకిందులవుతుందనుకోవడం అజ్ఞానం. అనేక అజ్ఞానాలతో జీవించే ప్రజలకు ఈ కొత్త అజ్ఞానం కూడా జతకలిపితే ఎలా? భారతదేశ సన్యాసుల్లో, సన్యాసులైన విప్లవకారుల్లో ఈ స్పష్టత కనిపిస్తుంది. అది ఆహ్వానించదగ్గది. అక్కున చేర్చుకోవలసింది. సన్యాసుల జ్ఞాన తృష్ణ, మనిషి-ప్రకృతికి మధ్యగల సంబంధాలను అర్థం చేసుకునేందుకు పడే తపన, అనే్వషణ అనన్య సామాన్యమైనది. ఇది భారత ఉపఖండపు ప్రత్యేకత.

ప్రపంచానికి గొప్ప పాలనాశాస్త్రాన్ని అర్థశాస్త్రంతో మిళితం చేసి చాణక్యుడు చెప్పిన ప్రాథమిక అంశం సైతం సన్యాసిలో రాజు నిస్వార్థంగా, నిరపేక్షకంగా ఉండాలని పేర్కొన్నాడు. చాణక్యుడు ఆచార్యుడే అయినా గొప్ప సన్యాసిలా, ‘రాజగురు’గా జీవించారు. బుద్ధునికి పూర్వం గల రాజాస్థానాల్లో రాజగురువులుగా సన్యాసులు, శాస్త్రాలు తెలిసిన వారుండేవారని, వారి సలహాలు,సూచనలపైనే రాజు పాలించేవాడని మనకు తెలుసు. ఆ రకంగా సన్యాసి సమాజంలో విప్లవాత్మక పాత్రను శతాబ్దాలుగా పోషిస్తున్న విషయం అవగతమవుతోంది.

భారతదేశంలో అన్యమతాలు, ధర్మాలు ప్రవేశించాక అరాచక పరిస్థితులు నెలకొన్న సమయాన సన్యాసి ఆదిశంకరాచార్య దేశంలో గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చిన సంగతిని విస్మరించలేం. వర్ణాశ్రమ ధర్మం పేర భ్రష్టుపడుతున్న వైదిక విధానాలకు, హిందూ ధర్మం పద్ధతులకు ఆయన పునరుజ్జీవం కల్పించారు. ఆనాటి సమాజంలో కరడుగట్టిన ఆధ్యాత్మిక వాదులను తన వాదం చేత, జ్ఞానం చేత చిత్తుచేసి సమాజానికి నూతన జవసత్వాలు అందించారు. సమాజంలో అణగారిన వర్గాలవారు సైతం ఆయన సంస్కరణలకు ముగ్ధులయ్యారు. ధర్మపాలనకు గాను దేశం నాలుగువైపులా నాలుగు పీఠాలను ఏర్పరచి ప్రజల జీవనంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఆయన సృష్టించిన సాహిత్యం, అందించిన జ్ఞానం అజరామరం. భౌతిక సంపదపై మక్కువ పెరిగిన 20వ శతాబ్దంలో సామాజిక, ఆధ్యాత్మిక విలువలను పునరుద్ధరించడానికి మరో సన్యాసి ‘శ్రీల ప్రభుపాద’ (ఎ.సి. భక్తివేదాంత) ఒంటిచేత్తో గొప్ప విప్లవం తీసుకొచ్చారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఏర్పాటు చేసి ప్రపంచమంతటా ‘హరే రామ హరే కృష్ణ’ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని నిర్మించారు. భ్రష్టుపట్టిపోతున్న మానవ సంబంధాలను (హిప్పీ సంస్కృతి) తిరిగి పట్టాలపైకి తీసుకురావడం గొప్ప విప్లవం గాక ఏమవుతుంది? ఇస్కాన్ ఇప్పుడొక జీవన విధానంగా ఉబికి వచ్చింది. విలువలతో కూడిన జీవన విధానం, విద్యా విధానం ఏర్పరచుకుని ఆ మార్గాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేస్తున్నారు. కృష్ణ మందిరాలను నిర్మిస్తున్నారు. తూర్పు దేశం ఆధ్యాత్మిక చింతన, భక్త్భివం ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ప్రబలంగా కనిపిస్తోంది. పాశ్చాత్య దేశాల నాగరికతను అనుసరించే భారతదేశ యువతకు ఇస్కాన్ కళ్లు తెరిపించింది. ఏది మంచి? ఏది చెడు? అన్న విచక్షణను కలిగించింది.

మూడు దశాబ్దాల క్రితం మరో సన్యాసి శ్రీశ్రీ రవిశంకర్ ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ అన్న సంస్థను ఏర్పాటు చేసి మరో విప్లవాన్ని తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ప్రజలకు ‘ఒత్తిడి’ని తగ్గించే సుదర్శన యోగా ప్రక్రియను అందించడమేగాక మేలైన జీవన విధానాలను బోధిస్తున్నది. వాటిని ఆచరణలో పెట్టేలాచూస్తోంది. భారతదేశంలోనూ వేలాది గ్రామాల్లో ఈ సంస్థ ప్రజల జీవితాలను మార్చేందుకు ఉచిత విద్య,వైద్యం అందిస్తోంది. పొగాకు, మద్యం ముట్టని వందల గ్రామాలను తీర్చిదిద్దింది. ఇదేకదా విప్లవమంటే! ఆ సన్యాసి తీసుకొచ్చిన విప్లవం ఎంత విశేషమైనదో ఒకసారి ఊహిస్తే ఒళ్లు పులకిస్తుంది.

ఇంకో సన్యాసి రామ్‌దేవ్ బాబా భారతదేశ ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక ముఖ చిత్రం మార్చేందుకు పతంజలి యోగా పీఠ్ ద్వారా కృషిచేస్తున్నారు. బహుళ జాతి సంస్థల ఆర్థిక దోపిడీ నుంచి ప్రజలను రక్షించే పనిని ఒక సన్యాసి స్వీకరిస్తారని ఎవరూ ఊహించలేదు. కాని రామ్‌దేవ్ బాబా దీన్ని సవాల్‌గా తీసుకుని మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఇదికూడా ఈనాడు అవసరమైన విప్లవం. యోగా, ఆయుర్వేదం, విద్య, పరిశోధనలు, గోసంరక్షణ ఇట్లా అనేక రంగాల్లో ఆయన చేపట్టిన పనులు విప్లవాత్మకమైనవి. ఒక సన్యాసి దేశంలో అవినీతి, నల్లధనం, అరాచకాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని నిర్మించడం విప్లవం గాక ఏమవుతుంది? రామకృష్ణమఠం, ఇస్కాన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, పతంజలి యోగాపీఠ్, స్వామి చిన్మయానంద మిషన్… ఇలా ఎన్నో సంస్థలు, సన్యాసులు దేశానికి ఎన్నో సేవలు అందిస్తున్నా, రాజ్యాధికారాన్ని ఆశించడం లేదు. వైభవోపేతమైన ప్రాసాదాలను కాంక్షించడం లేదు. నిస్వార్థంగా దరిద్ర నారాయణుల సేవలో తరిస్తున్నారు. ఇదే కదా విప్లవ సారాంశం! ఈ సంస్కృతిని, సారాంశాన్ని అభిమానిస్తూ సన్యాసిగా మారాలనుకున్న వ్యక్తి నేడు ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. ఆయనే నరేంద్ర మోదీ. ఆ ‘సన్యాసి’- సాంస్కృతిక విప్లవకారులకు నైతికంగా మరింత బలం ఇస్తుండడం గొప్ప సందర్భంగానే భావించాలి.

– వుప్పల నరసింహం సెల్: 99857 81799

(ఆంధ్రభూమి సౌజన్యం తో)