సమర సతా సేవా ఫౌండేషన్ గత 7 సంవత్సరాలుగా హిందూ ధర్మ ప్రచారం చేస్తూ ఎస్సీ, ఎస్టీ., వర్గాల ధార్మిక ఉన్నతి కోసం అనేక నూతన ప్రయోగాలు చేస్తున్నది. 4 సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలో 502 స్థలాల్లో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో దేవాలయాలు నిర్మించింది. చాలా చోట్ల ప్రధాన గ్రామంలోని దేవాలయాలలోకి ఎస్సీ వర్గాల ప్రజలకు దేవాలయం ప్రవేశం లేదు. అయితే ఈ నూతన దేవాలయాల నిర్మాణం విషయంలో ఆయా గ్రామాలకు చెందిన అన్ని కులాల వారు ఆర్థిక సహాయం చేయడం ఒక గొప్ప విషయం. ఈ దేవాలయాల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వగా, ప్రతి గ్రామంలో స్థానికులు సుమారు 5 లక్షలు ఇచ్చారు. ఈ దేవాలయాల్లో ఆయా సామాజిక వర్గాల వారినే అంటే ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార వర్గాల వారినే అర్చకులుగా నియమించింది. వీరందరికీ TTDకి చెందిన శ్వేత సంస్థ 20 రోజుల శిక్షణ ఇచ్చింది. వీరందరూ చక్కగా పని చేస్తున్నారు. ఈ దేవాలయాల్లో అర్చకులకు జీతం, ఆదాయం లేదు. పూజాడుల ఖర్చు కూడా వారే భరిస్తున్నారు. ఆయినా ఈ అర్చకులు ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది రైతు కూలీలే! వీరి శ్రద్ద చూసి ఈ దేవాలయాలకు ఇతర కులాల భక్తులు పలుచోట్ల రావడం గమనార్హం. కొన్ని చోట్ల ఈ ఎస్సీ పూజారులను ఇతర కులాల వారు తమ గుళ్ళో అర్చకులుగా నియమించుకున్నారు.
అయితే ఈ పూజారులు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. వీరి ఆర్థిక ఇబ్బందులను తొలగించడం, వీరికి ప్రజలందరిలో గౌరవ హోదా కల్పించడం కోసం మే, జూన్ నెలల్లో 5 చోట్ల అనకాపల్లి జిల్లా యలమంచిలి, BCTలో, ద్వారక తిరుమలలో, అహోబిలంలో, సింహాచలంలో, కాణిపాకంలో ప్రత్యేక శిక్షణా తరగతులు ప్రతి చోట మూడు రోజులు నిర్వహించింది. అనుభవం ఉన్న బ్రాహ్మణ పురోహితులు నిత్య పూజ విధానం, గణపతి పూజ, పుణ్యాహవచనం, గృహప్రవేశం, అక్షరాబ్యాసం,హోమం, అన్నప్రాసన పూజలను నేర్పారు. జూన్ 27న కాణిపాకంలో తుది శిక్షణా తరగతులు పూర్తి అయ్యాయి.