Home News వేల ఏళ్ల వెలుగు, వరాల తెలుగు..

వేల ఏళ్ల వెలుగు, వరాల తెలుగు..

0
SHARE

మొదలెరుగని మధుకిరణం

మళ్లీ మొలకెత్తుతోంది,

మది మదిలో మాతృగళం

మధురిమ చిలికిస్తున్నది..

కోటి యుగమ్ముల ఉదయం

కొత్త కొత్తగా ఉన్నది,

మేటి తెలుగు పూలతోట

పరిమళాల మెరసినది..

భాగ్యనగర స్వరూపం తెలుగు ‘వ్యవహారం’తో వెలిగిపోతోంది. ప్రాంగణాలు, మందిరాలు, ద్వారాలు, తోరణాలు, బాటలు, మాటలు తెలుగు అక్షర సరాలతో తేజరిల్లుతున్నాయి. రేపు, శుభ కలియుగం 5119వ సంవత్సరం మార్గశిర కృష్ణ త్రయోదశినాడు, శుక్రవారంనాడు, మొదలుకానున్న ‘ప్రపంచ తెలుగు మహాసభల ‘స్ఫూర్తి’తో మన నిత్య జీవన వ్యవహారం సంకర భాష నుంచి విముక్తమై స్వీయ భాషాయుక్తం కావాలన్నది ఆకాంక్ష.. తెలుగు భాష ఆంగ్ల భాషతో సంకరమై ఉండడం నడుస్తున్న వ్యవహారం, ఇది మాతృభాషపట్ల మమకారం కలవారు నిరాకరించలేని నిజం. మన వ్యవహార భాషలో ‘క్రియాపదాలు’ మాత్రమే మిగిలి ఉండడం వర్తమాన వైపరీత్యం. ఆంగ్ల భాషకు చెందిన నామవాచకాలు, సర్వనామాలు, గుణవాచకాలు, విశేషణాలు మన భాషలోకి చొరబడిపోయి చెలగిపోతున్నాయి. మన భాషా పదాలను నెట్టేశాయి.. ‘్భరత జట్టు’ లేదు ‘టీమిండియా’ ఉంది; ‘అమ్మా నాన్నలు’ లేరు.. ‘మమీ డాడీలు’ ముక్కులెగరేసుకుంటూ మురిసిపోతున్నారు.. కిచెన్‌లో డీప్ ఫ్రైడ్ డెలికసీస్ వండుతున్నారు… ప్రభుత్వం ‘గవర్నమెంటు’గా మారిపోయింది! విలాసం – ఫ్యాషన్ – ముదిరి ‘గోరుమెంటు’గా మారింది కూడా! వ్యవహార రూపం- కమ్యూనికేటివ్ ఫార్మ్- భాషా యోషకు నోరు… విద్వత్ రూపం లేదా గ్రాంథిక రూపం – క్లాసికల్ ఫార్మ్- భాషా మాతకు మనస్సు, బుద్ధి! బ్రిటన్ దురాక్రమణదారులు మన నెత్తికెక్కి తొక్కిన సమయంలో క్రమంగా మన బుద్ధి మన మనస్సు మాత్రమే ఐరోపా భావజాలంతో సంకరమయ్యాయి, మన ‘నోరు’ మాత్రం తెలుగునే వల్లించింది, నోరు సంకరం కాలేదు, మన వ్యవహార భాష ఆంగ్ల పదాలతో సంకరం కాలేదు. కానీ బ్రిటన్ తస్కర ముష్కర మూకలు మన దేశం నుండి నిష్క్రమించిన తరువాత ‘బుద్ధి సాంకర్య ప్రభావం’ నోటికి కూడా విస్తరించింది, వ్యవహార భాష సంకరమైపోయింది.. తెలుగును మాత్రమే కాదు భారతీయ మాతృభాషలన్నింటినీ ఈ ఆంగ్ల సాంకర్యపు ‘తెగులు’ ఆవహించి ఉండడం ప్రపంచ తెలుగు మహాసభలకు విచిత్రమైన పూర్వరంగం.. మనం ఆంగ్ల భాషలో వ్యవహరిస్తున్నపుడు తెలుగు పదాలను వాడడం లేదు, ఆంగ్ల భాషలో వ్రాస్తున్నపుడు భారతీయ మాతృభాషల పదాలతో ఆ ‘రచన’లను సంకరం చేయడంలేదు! ఆంగ్ల భాషా స్వచ్ఛతను ‘అసిధారావ్రతం’ వలె సంరక్షిస్తూన్న మనం, తెలుగువారం, భారత జాతీయులం ఎందుకని మన గ్రాంథిక, వ్యావహారిక భాషారూపాలను ఆంగ్ల పదజాలంతో సంకరం చేస్తున్నాము? వికృతం చేస్తున్నాము?? నిరంతరం గాయపరుస్తున్నాము?

ఈ ‘గాయాల’కు చికిత్సను ప్రారంభించే వైద్య వేదికగా తెలుగు సభల ప్రాంగణం విలసిల్లాలి! ‘పదేన వాచాం’- పదములతో ‘పలుకుల’లను అంటే భాషను- ఆరోగ్యవంతం చేసిన వ్యవహార వైద్యుడు పతంజలి. మన వ్యవహార భాష అప్పటిది. ఇంకా పూర్వం నాటిది, ఆ తరువాతది! భాష మానవ జీవన శ్వాస.. నిత్య జీవన వ్యవహార మాథ్యమం.. మానవ జీవన వ్యవహారం అనాది, అనంతం! అందువల్ల భాషా వికాస క్రమం కూడా ఆద్యంతరహితం! కానీ భాష నిరంతరం ప్రవహించే సుధా మధుర స్రోతస్విని, రూపాంతరం చెందుతున్న భావాక్షర ధుని.. యుగాలకు పూర్వం నుంచి ఈ స్వరూప పరిణామక్రమం కొనసాగుతోంది. అందువల్ల అన్ని భాషల వలె తెలుగు భాష అనాదిగా ఉంది. ఇదీ వాస్తవ భాషా చరిత్ర! ఈ చరిత్రను ఆంగ్లేయుడైన ‘బిషప్ కాల్డ్‌వెల్’ చెఱిచాడు, బ్రిటన్ మేధావులు, విద్యావేత్తలు వికృతపరిచారు! బ్రిటన్ మానస విషపుత్రిక అయి వికృత భాషా చరిత్రను మన విద్యాలయాలలో ఇప్పటికీ బోధిస్తుండడం భారతీయ భాషలకు పట్టిన గ్రహణం! ఈ ‘గ్రహణం’ ఇప్పుడైనా తొలగిపోవడానికి ‘తెలుగు మహాసభలు’ వెలుగుల వేదికలు కావాలి…

తెలుగు నేలపై ఉన్నవారు అనాదిగా భాషను మాట్లాడుతున్నారు. ఐదు వేల నూట యాభయి ఐదు ఏళ్లకు పూర్వం- కలి పూర్వం ముప్ఫయి ఆరవ ఏట, క్రీస్తునకు పూర్వం మూడు వేల నూట ముప్ఫయి ఎనిమిదివ ఏట- జరిగిన ‘కురుక్షేత్ర’ మహాభారత యుద్ధం నాటికి ఆంధ్రులున్నారు, తెలుగువారు ఉన్నారు. నాటి ‘త్రిలింగసీమ’ ప్రస్తుత విదర్భ, తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు మరికొన్ని పరిసర ప్రాంతాలకు విస్తరించి ఉంది. అప్పటి ‘త్రిలింగసీమ’లోని ప్రజలు మాట్లాడిన భాషకు రూపాంతరం ఇపుడు మనం మాట్లాడుతున్న తెలుగు భాష! అలా ఐదువేల ఏళ్ల క్రితంనాటి ‘త్రిలింగసీమ’ వారు లేదా తెలుగువారు లేదా ఆంధ్రులు మాట్లాడిన ‘భాష’ అంతకు పూర్వం అనాదిగా యుగాలుగా ఈ ప్రాంతంవారు మాట్లాడిన భాషకు వివిధ కాలాలలో రూపాంతరం చెందిన భాషలకు – మరో రూపాంతరం మాత్రమే! వ్యవహార భాష నిరంతర రూపాంతరం చెందుతూ ఉంటుంది! నన్నయకాలం నాటి వ్యవహార భాష కాకతీయుల కాలంనాటికి కొద్దిగా రూపాంతరం చెందింది! హంపీ విజయనగర సామ్రాజ్యం కాలంనాటికి మరింత మారింది! ‘‘ఈశ్వరానుగ్రహమున మన దేశానికి ఆంగ్లేయుల పరిపాలన ప్రాప్తించిందని’’ కందుకూరి వీరేశలింగం పంతులు భావించే నాటికి, ప్రాచీన సాహిత్య రూపాలను ‘కొయ్యబొమ్మల’ని సమకాల సాహిత్య రూపాలు ‘కోమలుల’ని గురజాడ అప్పారావు భావించే నాటికి మరింతగా మారింది! వందల ఏళ్లలో మార్పులు వచ్చినప్పటికీ భాష వౌలిక స్వరూపం మారదు. కొన్ని పదాలు అర్థం కావు! కాని వేల ఏళ్ల మీద భాషాస్వరూపం పదజాలం వ్యాకరణం సమూలంగా మారిపోవచ్చు! అందువల్ల ఆంధ్ర శాతవాహనులు యావత్ భారతదేశాన్ని పాలించిన సమయంలో ఉండిన ‘త్రిలింగీ’ ప్రాకృత భాష లేదా మహారాష్ట్ర ప్రాకృత భాష ఇపుడు లేదు. అప్పటి ఆ ప్రాకృత భాష సమూల రూపాంతరం ఇప్పటి మన తెలుగు భాష! అంటే హాలశాతవాహనుని కాలంలోని ప్రాకృతభాష మారి మారి నేటి ‘తెలుగు’ ప్రాకృతంగా స్థిరపడింది, నేటి కన్నడ భాషగా స్థిరపడింది, ఈనాటి మరాఠీ భాషగా మరింతగా మారిపోయింది! ‘‘మహారాష్ట్రాశ్రయాం భాషా ప్రకృష్టం ప్రాకృతం విదుః…’’ అన్న నానుడి తరతరాలుగా కొనసాగుతోంది. తెలుగు భాష అందువల్ల ప్రాకృతభాషలలో ప్రకృష్టమైనది.. మేలైనది!

అంతేకాని హాల శాతవాహనుని కాలంలో ‘త్రిలింగసీమ’ ప్రజలు మాట్లాడిన భాష అకస్మాత్తుగా ఒక అర్ధరాత్రి వేళ అంతరించిపోలేదు, మరుసటి సూర్యోదయం నుంచి ఈ మన విస్తృత ‘త్రిలింగసీమ’ ప్రజలు ఇప్పటి మన తెలుగును మాట్లాడడం మొదలు కాలేదు- అలా ‘హాలుని’ నాటి భాష అకస్మాత్తుగా మరణించిందని, లేదా రెక్కలు వచ్చి త్రిలింగ సీమను దాటి ఎగిరిపోయిందని ‘బిషప్ కాల్డ్‌వెల్’ నిర్థారించాడు! మరుసటి రోజు నుంచి మనం ‘తెలుగు’ను, ఇప్పటి భాషను మాట్లాడడం మొదలైందట! మన దేశ చరిత్రను బ్రిటన్ విబుధ దైత్యులు వికృతంగా వక్రీకరించారు. కాల్డ్‌వెల్ కల్పించిపోయిన అబద్ధాలు ఈ విస్తృత వక్రీకరణలో భాగం! కాల్డ్‌వెల్ క్రీస్తుశకం 1858లో తన కట్టుకథలను ఆవిష్కరించడానికి నేపథ్యం 1757 తరువాత విలియమ్ జోన్స్ అనే ‘సర్’ ముసుగులోని బౌద్ధిక బీభత్సకారుడు ఘోరంగా భారత చరిత్రను వక్రీకరించడం, థామస్ బాబింగ్‌టన్ మెకాలే అన్న భారత విద్రోహి 1834లో ఆరంభించిన విద్యావిధానం!! వీరి లక్ష్యం భారతీయులలో అంతర్గత వైరుధ్యాలను సృష్టించి వారిని శాశ్వతంగా పరస్పర వైరుధ్యాలకు విద్వేషాలకు గురిచేయడం.. ఇరవై శతాబ్ది ఆరంభంలో, మన దేశంలో బ్రిటన్ సాగిస్తున్న బౌద్ధిక బీభత్సకాండకు మార్క్సిస్ట్ మేధావులు తోడయ్యారు. ఈ ‘చతుష్టయం’-జోన్స్, మెకాలే, కాల్డ్‌వెల్, మార్క్సిస్ట్ మేధావి- వారి వారసులు ఇప్పటికీ విద్యాలయాలలో ఈ ‘విభజన’ పాఠాలను బోధిస్తున్నారు, విద్వేషాన్ని వ్యవస్థీకరిస్తున్నారు! ఈ ‘విద్వేష కబంధ బంధం’ తెలుగు భాషను విముక్తం చేయడానికి ‘మహాసభలు’ వేదికలు కావాలి, తెలంగాణ ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు జాగ్రత్తపడాలి!

హాలుని కాలం నాటి ప్రాకృత భాష ఇప్పటి మన తెలుగు భాషకు ‘పూర్వరూప’మన్న వాస్తవం మళ్లీ వెలగాలి! ‘‘వెలిగినట్టయితే’’, క్రీస్తునకు పూర్వం 833వ సంవత్సరం నుంచి ఆ ప్రాకృత భాష రూపాంతరం చెంది చెంది క్రీస్తునకు పూర్వం 323 నాటికి తెలుగు భాషగా స్థిరపడిందన్న చరిత్ర కూడా మళ్లీ ధ్రువపడింది. అందువల్ల ఇప్పటి మన తెలుగు భాష పూర్వ రూపాలు అనాదిగా కొనసాగుతున్నప్పటికీ, తెలుగు భాష ప్రస్తుత రూపానికి అంకురార్పణ క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో జరిగింది! ఇదే సమయంలో ఇతర ప్రాకృత భాషలు తమిళంగాను ఇతర భారతీయ – ప్రస్తుత – భాషలుగాను కొనసాగే ప్రక్రియ కూడా కొనసాగింది. ఈ ‘ప్రాకృత భాష’ల పూర్వరూపాలు అంతరించిపోయి కొత్త ప్రాకృత భాషలు పుట్టుకొచ్చాయి. ఈ ప్రాకృత భాషలన్నీ కూడా ఒకే సంస్కృత భాషకు వివిధ రూపాంతరాలన్నది సనాతన వాస్తవం! ‘సనాతనం’ అని అంటే ‘శాశ్వతమైనది’ అని అర్థం! ఈ వాస్తవాన్ని చెఱచిన బిషప్ కాల్డ్‌వెల్ వంటివారు వారి వారసులు దక్షిణ భారత భాషలు సంస్కృత, భాషా కుటుంబంలోనివి కావని ఇప్పటికీ బోధిస్తున్నారు. దక్షిణ భారతీయులను ఉత్తర భారతీయులను పరస్పరం విడగొట్టడానికి ‘బ్రిటన్’ పన్నిన పన్నాగం ఇది! తెలుగు ‘వ్యవహారం’ నుంచి సంస్కృత భాషా పదాలను తప్పించడానికి, ఆంగ్ల పదాలను చొప్పించడానికి జరిగిన కుట్రను తెలంగాణ ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు ఇప్పుడైనా గుర్తించాలి, బద్దలు చేయాలి! మేధావులుగా చెలామణి అవుతూ చరిత్రను భాషను భారత జాతీయ సాంస్కృతిక పథం నుంచి తప్పించడానికి కుట్రను సాగిస్తున్న బ్రిటన్ మానసపుత్రులను, వర్గ సమర సిద్ధాంత ప్రచారకులను తెలంగాణ ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు ఇప్పుడైనా పసిగట్టాలి! తెలుగు భాషను ఆంగ్ల పదజాల బంధం నుంచి తప్పించాలి!

తెలుగునకు వ్యవహార రూపం బ్రిటన్ దురాక్రమణ కాలంలో మాత్రమే మొదలయిందన్నది ఘనంగా ప్రచారవౌతున్న మరో అబద్ధం.. నిజానికి ‘‘నన్నయభట్టు తెనుంగునన్ మహాభారత సంహితా రచన’’ మొదలుపెట్టడానికి శతాబ్దుల నేపథ్యం తెలుగులో జరిగిన వ్యవహారం!

‘‘తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేద వారలకెగ్గుల్..’’ చేయు వారు ఆపదల పాలవుతారని ‘కుక్క’ చేత చెప్పించిన నన్నయ ‘వ్యవహారం’లో తెలుగునకు పట్టం కట్టాడు. తెలుగు భాష వ్యవహార రూపం అప్పటిది.. అంతకుపూర్వం శతాబ్దులుగా జనం నోళ్లలో నర్తించినది!

‘‘ఏమి నోము ఫలమొ ఇంత పొద్దొక వార్త

వింటి మన్నలార వీనులలర..

మన యశోద చిన్ని మగవాని కననెట,

చూచి వత్తమమ్మ సుదతులార!’’ అన్న బమ్మెర పోతన వ్యవహార భాషా ఉద్యమకారుడు. తాళ్లపాక అన్నమయ్య, కంచెర్ల గోపన్న వంటి వారు తెలుగు భాష వ్యవహార రూపాన్ని అజరామరం చేసిన అమృత జీవనులు. వారు సహిష్ణు స్వభావులు, సమన్వయ తత్త్వవేత్తలు. అందువల్లనే వారందరూ తెలుగు భాషకు ‘క్లాసికల్’ – గ్రాంథిక రూపం, కమ్యూనికేటివ్ – వ్యవహార రూపం రెండూ ఉన్నాయని గుర్తించారు. ఒకదాన్ని చంపి మరొకదాన్ని మాత్రమే బతికించాలని ఉద్యమించలేదు! అక్షరాలు రాని లక్షలాది గ్రామీణులు వందలాది పోతన్న పద్యాలను, వేమన్న పద్యాలను అన్నమయ్య గీతాలను, గోపన్న కీర్తనలను శతాబ్దుల తరబడి కంఠస్థం చేసి వల్లె వేశారు! ఈ సంప్రదాయాన్ని చంపడానికి దశాబ్దులుగా జరుగుతున్న కుట్రను తెలంగాణ ప్రభుత్వం భగ్నం చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భగ్నం చేయాలి.. తెలుగు భాషా సాహిత్యాలు మాధ్యమం.. భారతీయత లక్ష్యం!

-హెబ్బార్ నాగేశ్వరరావు 9951038352

(ఆంధ్రభూమి సౌజన్యం తో)