కరోనా కారణంగా విద్యా వ్యవస్థ కాస్త వెనుకబడిందని… తిరిగి దానిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని విద్యాభారతి అఖిల భారత అధ్యక్షులు దూసి రామకృష్ణ అభిప్రాయ పడ్డారు. ఈ దిశగా విద్యారంగంలో కృషి జరగాలని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ విద్యాలయాలు నడుపుతున్న స్వచ్ఛంద విద్యా వ్యవస్థల సమూహం గా విద్యాభారతి వినుతి కెక్కిన విషయం తెలిసిందే.
విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర (ఏపీ, తెలంగాణ, కర్నాటక) రెండు రోజుల క్షేత్రీయ సమావేశాలు నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో జరిగాయి. విలువలతో కూడిన విద్యను అందిస్తున్న విద్యా భారతి పాఠశాలల్లో జరుగుతున్న వివిధ కార్యకలాపాలను సమీక్షించారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేయటంలో జాతీయ విద్యా విధానం కీలక పాత్ర పోషిస్తుందని రామకృష్ణ అన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకొని వెళ్లేందుకు విద్యా భారతి కార్యకర్తలు చురుగ్గా వ్యవహరించాలని ఆయన సూచించారు.
శ్రీ సరస్వతీ శిశుమందిరాల ప్రభావం సమాజంపై గాఢంగా ఉందని దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు, రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వరరావు తెలిపారు. విద్యా భారతి కార్యకర్తలు సంఘటితంగా వుంటూ అనుకున్న ,లక్ష్యాలను చేరుకోవాలన్నారు. కేవలం వాచక జ్ఞానం వుంటే సరిపోదని… దానిని అనుభవైక జ్ఞానంగా మలుచుకున్నప్పుడే లక్ష్యం నెరవేరుతుందని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
నూతన జాతీయ విద్యా విధానం సహా అనేక అంశాలపై విద్యా భారతి నుంచి అనేక పుస్తకాలు, సాహిత్యం విడుదల అవుతున్నాయి. తాజాగా బాలికల విద్య పట్ల అవగాహన కల్పించేందుకు .. “బాలిక విద్య” అనే పుస్తకాన్ని రూపొందించి ఆవిష్కరించారు. రెండు రోజుల కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, కార్యదర్శి అయాచితుల లక్ష్మణ రావు, ఆంధ్రప్రదేశ్ ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, అనంతపురం సమితి అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మూడు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.