Home News అయోధ్య విచారణ ఆపలేం: సుప్రీం కోర్టు

అయోధ్య విచారణ ఆపలేం: సుప్రీం కోర్టు

0
SHARE

అయోధ్య కేసు విచారణను 2019 లోక్‌సభ ఎన్నికలు జరిగిన తరువాతే చేపట్టాలన్న వాదనను సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది. వక్ఫ్ బోర్డుతోపాటు కేసుతో సంబంధం ఉన్న వర్గాల చేసిన వాదనపై సుప్రీం కోర్టు దాగ్బ్రాంతిని, విస్మయాన్ని వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8కి కేసు విచారణను వాయిదా వేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలోని సుప్రీం బెంచ్ అలహాబాద్ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను మంగళవారం విచారించింది.

బాబ్రీ మసీదు విధ్వంసం జరిగి 25 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఈ కేసు సుప్రీం విచారణకు రావడం గమనార్హం. 2010లో అయోధ్య స్థలానికి సంబంధించి మెజార్టీ తీర్పునిచ్చిన అలహాబాద్ హైకోర్టు సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అకారా, రామ్‌లాలీలా సమానంగా పంచుకోవాలని స్పష్టం చేసింది. దీనికి వ్యతిరేకంగా దాఖలైన అప్పీళ్లను నేడు సుప్రీం కోర్టు విచారించింది. కపిల్ సిబల్, రాజీవ్ ధావన్ సహా పలువురు సీనియర్ లాయర్లు ఈ కేసు విచారణను 2019 ఎన్నికల తరువాత చేపట్టాలన్న వాదనను సుప్రీం బెంచ్ ప్రాథమికంగా తిరస్కరించింది. అయితే, 2019 ఎన్నికల తరువాతే అయోధ్య వివాదంపై విచారణ చేపట్టాలన్న కపిల్ సిబల్ వాదనపై దుమారం రేగింది.

కపిల్ సిబల్ మంగళవారం సుప్రీం కోర్టులో సున్ని వక్ఫ్‌బోర్డు తరపున వాదనలు వినిపిస్తూ రామమందిర వివాదం విచారణ కొనసాగిస్తే దీని ప్రభావం 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలపై పడుతుందన్నారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తామని బీజేపీ తమ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది కాబట్టి విచారణను వాయిదా వేయాలని సిబల్ డిమాండ్ చేశారు. అయితే సుప్రీం కోర్టు సిబల్ ప్రతిపాదనను తిరస్కరించింది. కోర్టు విచారణకు లోక్‌సభ ఎన్నికలకు ఉన్న సంబంధమేమిటని ప్రశ్నిస్తూ అయోధ్య రామమందిరం వివాదానికి సంబంధించిన విచారణను 2019 లోక్‌సభ ఎన్నికలు ముగిసేంతవరకు వాయిదా వేయటం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అయోధ్య రామమందిర వివాదానికి సంబంధించిన పత్రాలు సక్రమంగా లేనందున విచారణ వాయిదా వేయాలని సున్ని వక్ఫ్ బోర్డు డిమాండ్ చేసింది. ఈ కేసును 2019 లోక్‌సభ ఎన్నికల తరువాత చేపట్టడం అందరికీ మంచిదని సిబల్ వాదించారు.

కపిల్ సిబల్ మంగళవారం సుప్రీం కోర్టులో చేసిన డిమాండ్‌ను బీజేపీ తీవ్రంగా ఖండించింది. సుప్రీం కోర్టులో సున్ని వక్ఫ్ బోర్డు తరపున మాట్లాడకుండా కాంగ్రెస్ తరపున సిబల్ వాదిస్తున్నారని ఆరోపించింది. రామమందిరం నిర్మాణానికి, 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలతో ఉన్న సంబంధమేమిటని బీజేపీ ప్రశ్నించింది. కాంగ్రెస్ మొదటినుంచీ రామమందిరం అంశాన్ని రాజకీయం చేస్తోందని దుయ్యబట్టింది. కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో చేసిన వాదనపై కాంగ్రెస్ నోరు విప్పాలని డిమాండ్ చేసింది. ఆయన సున్ని వక్ఫ్‌బోర్డు తరపున వాదిస్తున్నారా? లేక కాంగ్రెస్ తరపున వాదిస్తున్నారా? అనేది కపిల్ సిబల్ స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. రామమందిరం వివాదంపై ప్రారంభమైన విచారణ 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తుందనటం రాజకీయం కాదా? అని బీజేపీ ప్రశ్నించింది. కాంగ్రెస్ మొదటినుంచీ మైనారిటీలను తన రాజకీయం కోసం వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలావుంటే అయోధ్య వివాదంపై సిబల్ సుప్రీం కోర్టులో చేసిన వాదనతో తమకెలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. సిబల్ తాజా ప్రతిపాదన వల్ల తమకు రాజకీయంగా నష్టం కలుగుతుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే కాంగ్రెస్ ప్రతినిధి అజయ్‌కుమార్ ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ కపిల్ సిబల్ ఒక న్యాయవాదిగా సుప్రీం కోర్టులో సున్ని వక్ఫ్ బోర్డు తరపున వాదిస్తున్నారు తప్ప కాంగ్రెస్ తరపున కాదనేది గ్రహించాలని వివరించారు. కపిల్ సిబల్ లాయరుగా కోర్టుల్లో చేసే వాదనలతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం ఉండదని అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. కపిల్ సిబల్ మాదిరిగానే బీజేపీకి సంబంధించిన పలువురు అడ్వకేట్ నాయకులు మంగం ఎగుమతి సంస్థల తరపున వివిధ కోర్టులో వాదించటం లేదా? అని కాంగ్రెస్ ఎదురు ప్రశ్నించింది. బీజేపీ మొదటినుంచీ రామమందిరం నిర్మాణం అంశాన్ని రాజకీయం చేస్తోందని అజయ్‌కుమార్ ఆరోపించారు. సుప్రీం కోర్టులో కపిల్ సిబల్ వాదనలను ఒక అడ్వకేట్ వాదనగా తీసుకోవాలి తప్ప ఒక రాజకీయ పార్టీ వాదనగా తీసుకోరాదని ఆయన స్పష్టం చేశారు.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)