Home News ఉర్దూ రుద్దుడు ఎందుకు?

ఉర్దూ రుద్దుడు ఎందుకు?

0
SHARE

తెలంగాణలో అత్యధిక శాతం ప్రజలు తెలుగు వాళ్లే అన్న విషయం  ప్రతి ఒక్కరికీ తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ ఏర్పడిన తర్వాత అయినా అధికారిక తెలుగు అధికారిక భాషగా అలంకారప్రాయమే అయింది. 85 శాతం ప్రజల మాతృభాష తెలుగును కచ్చితంగా ప్రభుత్వ వ్యవహారాల్లో అమలు చేయాలని భాషాభిమానులు ఎంత మొత్తుకున్నా, ప్రభుత్వ పెద్దలకు తలకెక్కదు.

వ్యవహారం ఇలా ఉంటే ప్రభుత్వం తాజాగా కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ శిలాఫలకాలు, నామ ఫలకాలు ఉర్దూలో ‘కూడా’ ఉండాలన్నది ఆ ఆదేశాల సారాంశం. తెలంగాణలో తెలుగు వారు 85 శాతం ఉన్నారు. ఉర్దూ చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చిన వారు వాస్తవానికి 10 శాతం కన్నా తక్కువే ఉంటారు. కానీ ప్రభుత్వం మతం ఆధారంగా 15 శాతం ముస్లిం ప్రజల పేరిట ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని నగరాలు, కొన్ని పట్టణాలు తప్ప గ్రామీణ ప్రాంత ముస్లింలంతా తెలుగులోనే మాట్లాడతారు. తెలుగు కేవలం హిందువుల మాతృభాష మాత్రమే కాదు. చాలా మంది ముస్లింలు, క్రిస్టియన్లు దైనందిన వ్యవహారాల్లో ఉపయోగించేది తెలుగు భాషే.

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఉర్దూ మాట్లాడే వారు ఉన్నా అక్కడ మరాఠీ, కన్నడ భాషలు మాత్రమే ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో కనిపిస్తాయి. తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలలో తెలుగువారు 30-40శాతానికి పైగా ఉన్నా, వారు గట్టి ఓట్ బ్యాంక్ అయినా ఆయా రాష్ట్రాల్లో తెలుగుకు రెండో అధికారిక భాషగా గుర్తింపు ఇవ్వలేదు. కానీ తెలంగాణలో (బహుశా ఏపిలో కూడా) మాత్రమే  పరిస్థితి ఇలా ఉంది.

హైదరాబాద్ సంస్థానంలో నిరంకుశ నిజాం పాలకులపై ప్రజల తిరుగుబాటుకు మెజారిటీ ప్రజల భాష తెలుగుపై నిర్బంధం, ఉర్దూ రాజ్య భాషగా పెత్తనం ఒక కారణం. ఇది కాదనలేని చారిత్రిక సత్యం. మరి ఇప్పుడు జరుగుతున్న ది ఏమిటి? పైగా తెలుగు రాష్ట్రంలో ఉర్దూను తప్పనిసరి చేయడం ఎందుకు? మనం మళ్లీ తిరోగమన దిశగా పోతున్నామా?

కేవలం తెలుగు రాని, ఉర్దూ మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్న హైదరాబాద్ లోని పాత బస్తీలో ఉర్దూలో కూడా శిలాఫలకలు, నామ ఫలకాలు ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ రాష్ట్రం మొత్తం మీద ఉర్దూను బలవంతంగా రుద్దడం దారుణం. ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుని ప్రభుత్వం  అత్యధిక ప్రజలు మాట్లాడే తెలుగును అధికారిక భాషగా పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రయత్నం చేయాలి.

-క్రాంతి దేవ్ మిత్ర