Home News శ్రామికుల్ని మరచిన మార్క్సిస్టులు

శ్రామికుల్ని మరచిన మార్క్సిస్టులు

0
SHARE

కేంద్రంలో భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమని సీపీఎం మరోసారి ప్రకటించింది. ఆ పార్టీ 22వ జాతీయ మహాసభలు ఐదురోజులపాటు హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించిన ఆ పార్టీ తెలంగాణ రాజధానిలో మహాసభల క్రతువును హంగూ ఆర్భాటాలతో పూర్తిచేసుకుంది. అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలకు భారత్‌ను మోదీ ప్రభుత్వం తాకట్టుపెడుతోందని మహాసభల్లో ఆరోపించారు. దేశ సమైక్యతను కాపాడేందుకు ప్రత్యామ్నాయ విధానాలే మార్గమని, వామపక్ష-ప్రజాతంత్ర శక్తుల బలోపేతం ద్వారానే అది సాధ్యమని చెబుతూ తామే అసలు సిసలు ప్రత్యామ్నాయమని సీపీఎం ప్రకటించింది. వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, ప్రతినిధులు, ఆహ్వానితులు హాజరైన ఈ మహాసభలు ‘ఖరీదైన వ్యవహారాన్ని’ తలపింపజేశాయి. సుత్తి, కొడవలి, నక్షత్రం పతాకంగా గల పార్టీ వాటికి ప్రాతినిధ్యం వహించే వర్గాల గూర్చిన చర్చ చేయకుండా, ‘మతతత్వ’ భాజపా అంటూ విరుచుకు పడటం వల్ల శ్రామికవర్గం కడుపు నిండుతుందా?

ప్రజల చుట్టూ తిరగాల్సిన శ్రామికవర్గ పార్టీలు ఇలా ఇతర పార్టీల చుట్టూ తిరగడం, వాటిని ఢీకొనేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవడం ఆధునిక పరిస్థితుల్లో అంతగా నప్పని వ్యవహారం. మన దేశపుకమ్యూనిస్టు పార్టీల్లో భారతీరుూకరణ కనిపించదు. ఈ ప్రధాన లోపాన్ని గతంలో ఎందరో కమ్యూనిస్టు నేతలు (రావి నారాయణరెడ్డి వగైరా) ఎత్తిచూపినా అధినాయకత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఆ అంశాన్ని ‘కోల్డ్‌స్టోరేజి’లోకి శాశ్వతంగా పంపించేశారు. జాతీయ మహాసభల్లోనూ మార్క్స్, లెనిన్, స్టాలిన్ తదితర నాయకుల ప్రతిమలు తాజ్‌మహల్ అంత అందంగా తీర్చిదిద్దారు కాని ఈ దేశపు మహానాయకుల మూర్తిమత్వం కనిపించలేదు. ఇది దేనికి చిహ్నం? 125కోట్ల దేశ జనాభాను ప్రభావితం చేసేందుకు సిద్ధమైనప్పుడు ఈ నేల పరిమళం అవసరం లేదా? వాస్తవానికి మార్క్స్, ఏంగిల్స్, లెనిన్, స్టాలిన్ 19, 20వ శతాబ్దాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆనాటి భావజాలానికి వారు ప్రతీకలైతే ఆధునిక కాలానికి వారి ఆలోచనాధార ఎలా ప్రాసంగికం అవుతుందనే ప్రశ్న 21వ శతాబ్దంలో తప్పక వేసుకోవాలి? ఈ ప్రశ్న మార్క్సిస్టుపార్టీ 22వ జాతీయ మహాసభల్లో వినిపించిందా? లేదు! మార్క్స్ కాలం నాటి బూర్జువా, భూస్వామ్య, సామ్రాజ్యవాదం అంతే సాంద్రతతో శిలాజంగా కనిపించదు. కాని కమ్యూనిస్టులకు, మార్క్సిస్టులకు అంతే క్రూరంగా కనిపించడం విచిత్రం. ఆ తూకం రాళ్ళనే ఇంకా ఉపయోగించడం తమనితాము ఆత్మవంచన చేసుకోవడమేగాక, శ్రామిక వర్గాన్ని వంచించడమే అవుతుంది. అమెరికాలోని చికాగోలో కార్మికులు పనిగంటలు తగ్గించాలని ఉద్యమించి సాధించుకున్న స్ఫూర్తి రంగు వెలిసిపోతోంది. ఆ దృక్కోణాన్ని విస్మరించి సీపీఎం నేతలు రాజకీయంపై ఫోకస్ పెట్టడం వల్ల బిజెపిని గద్దె దించడమే ప్రధాన కర్తవ్యంగా కనిపిస్తోంది. ఇది ఎంతటి హాస్యాస్పదం?

ప్రస్తుతం ఉత్పత్తి సంబంధాలు సంపూర్ణంగా మారిపోయాయి. సాంకేతిక పరిజ్ఞానం అంతటా విస్తరించింది. సైబర్ మయమవుతోంది. పెట్టుబడిదారి వర్గం-కార్మికవర్గం ఒకే రకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రామికవర్గం 150 సంవత్సరాల క్రితపు తొలి పారిశ్రామిక విప్లవంనాటి సమస్యలు ఎదుర్కోవడంలేదు. నాల్గవ పారిశ్రామిక విప్లవంవల్ల ఎదురవుతున్న సమస్యలను ఎదుర్కొంటున్నది. వాటిని అంచనా వేసే ‘జ్ఞానం’ మార్క్సిజంలో లేదు. పరిష్కారం అంతకన్నా కనిపించదు. మరలాంటప్పుడు జాతీయ సభలు చేయవల్సిందేమిటి? చేసిందేమిటి? అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది.

మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అనుసరించాల్సిన వ్యూహం ఎలా ఉండాలి? కాంగ్రెసు పార్టీతో కలవాలా? వద్దా? అన్న అంశంపై ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చుచేసి నిర్ణయం తీసుకోవాలా? దానికి ఇంత హంగు-ఆర్భాటం, వనరుల ఖర్చు అవసరమా? ఈ ప్రశ్నలు కొందరికి అసహజం అనిపించినా అంతిమ సారాంశంలో ఇవే సరైన ప్రశ్నలుగా మిగులుతాయి. పార్టీ మహాసభలంటే ఆ పార్టీ కార్యకర్తలకు, పార్టీవైపు చూసే ప్రజానీకానికి, మద్దతుదారులకు దిశాదశ ఇవ్వడం. అది వర్తమాన పరిస్థితిలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కర రూపంలో ఉండాలి. కాని అందుకు భిన్నంగా బిజెపిపైనే దృష్టి పెట్టి ప్రసంగాలు, విశే్లషణలు చేస్తే ఏమిటి ప్రయోజనం? త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోయిన బాధ ఆ విశే్లషణలో వ్యక్తమవుతోంది తప్ప శ్రామికవర్గానికి అవసరమైన ఆధునిక దిక్సూచి ఏదీ కనిపించలేదు. కేరళను ఎలా కాపాడుకోవాలి? త్రిపురను తిరిగి ఎలా దక్కించుకోవాలి? బెంగాల్‌లో పూర్వ వైభవాన్ని ఎలా సాధించుకోవాలి? శ్రామిక వర్గానికి ఇవ్వాల్సిన సందేశంపై చర్చ చేయకుండా మోదీ, ట్రంప్ ప్రభుత్వాలపై ఆలోచన అంత సవ్యమైనది కాబోదు. బంతిని నేలకు ఎంత గట్టిగా కొడితే అంత ఎత్తుకు ఎగురుతుంది. గత 60-70 ఏళ్ళుగా మతతత్వంపై కమ్యూనిస్టులు విరుచుకుపడుతున్నా ఫలితం కనిపిస్తోందా? వాస్తవానికి కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు ఆ అంశం జోలికి పోకూడదు. అది వ్యక్తులకు సంబంధించిన విశ్వాసం. దాన్ని ఎదుర్కొనే ‘సత్తా’రాజకీయ పార్టీలకు లేదనే విషయం ప్రపంచమంతటా ఎప్పుడో రుజువైంది. ఇస్లాం దేశాల్లో అది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సత్యం బోధపడటానికి ఇంకా ఎన్ని దశాబ్దాలు కావాలి? ఎన్ని వనరులు ఖర్చుకావాలి? అదే సమయాన్ని, ఆర్థిక వనరుల్ని, శ్రామికవర్గం కొత్తతరంపై, వారి డిజిటల్ లిటరసీపై, లిటరసీపై, వారి జ్ఞానదారులను మెరుగుపరిచే అంశంపై, వృత్తినైపుణ్యాలపై ఖర్చుచేసుంటే బ్రహ్మాండమైన ఫలితాలు కనిపించేవి. అవన్నీ ప్రభుత్వం చేయాల్సిన పనులుగా భావించి బిజెపిని గద్దె దించడమే ధ్యేయంగా భావించడం తగునా?

పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టిపైనా మహాసభలు మండిపడ్డాయి. ప్రభుత్వం ఏం చేసినా దాన్ని విమర్శించాలన్న వైఖరి ఆధునిక కాలంలో సరైనదికాదు. అదే సరైనదన్న భావనను ప్రజల్లో కల్పిస్తున్నారు. మోదీ చేపట్టిన ఈ రెండు ఆర్థిక సంస్కరణలు ఆర్థిక క్రమశిక్షణకు ఉపకరించేవి, దీర్ఘకాలంలో మంచి ఫలితాలనిస్తాయని ఆర్థిక నిపుణుల మాట. వాటి అమలులో లోపాలు జరిగిన విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. కాని సంస్కరణలనే వ్యతిరేకించడం విడ్డూరం. ఇలాంటి ఆర్థిక సంస్కరణలు ఇతర దేశాల్లోనూ చోటుచేసుకున్నాయి. తమ సౌకర్యార్థం దీన్ని విస్మరించరాదు కదా? వాస్తవానికి ఈ సంస్కరణలు సాహసోపేత నిర్ణయాలు. వాటివల్ల ప్రయోజనంలేకపోయి ఉంటే బిజెపి ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయి ఉండేది, ఈ మహాసభల్లో మార్క్సిస్టులు మోదీ సర్కారును గద్దెదింపే ఆలోచన చేసేవారూ కాదు.

స్వాతంత్య్రానికి పూర్వం రాజకీయం వేరు, పార్టీల పనితీరు, వ్యవహారశైలి వేరు. స్వాతంత్య్రానంతరం రాజకీయం, పార్టీల పనితీరు వేరుగా ఉండాలి. కమ్యూనిస్టుల పోరాట పంథా, వ్యవహారశైలి మారలేదు. అది ఆహ్వానించే అంశంగానే వారు భావించినా సమర్ధనీయం కాదు. ముఖ్యంగా సంపద సృష్టి ప్రాథమ్యాలలో గణనీయమైన మార్పు జరిగినప్పుడు మరింత మెలకువను ప్రదర్శించాలి.

ఆర్థిక రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చే మార్క్సిస్టులు మహాసభల్లో మారిన సంపద సృష్టి ప్రాథమ్యాలపై చర్చచేసి ప్రజలకు సరైన మార్గం సూచించాల్సింది. ఎంతసేపూ ‘మూస’ ధోరణి తప్ప ఆధునిక అవసరాలను పట్టించుకోకపోతే ఎలా? సమకాలీన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం సమాజాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళుతోంది. బయోటెక్నాలజీ, సైబర్ టెక్నాలజీ, నానోటెక్నాలజీ, ఐటి, రోబోటిక్స్ అన్నీ సమ్మిళితమై సరికొత్త ఎత్తుకు సమాజాన్ని తీసుకెళుతున్న ‘దృశ్యం’ అందరికి కనిపిస్తోంది. విద్య- వైద్యం, రవణా,కమ్యూనికేషన్స్ రంగాల్లో అనూహ్య మార్పులు, విప్లవాత్మక పరిణామాలు స్పష్టంగా అగుపిస్తున్నాయి. ‘డేటా’యే ఇంధనం అన్న అభిప్రాయం చిక్కనవుతోంది. డ్రైవర్లు లేని వాహనాలు రోడ్లమీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత స్మృతులు, జ్ఞాపకాల్లో మునిగి తేలడంవల్ల ఒరిగేది ఏమీ ఉండదు. వర్తమానం, భవిష్యత్‌పై స్పష్టత ఉన్నప్పుడే జీవనం మెరుగ్గా ఉంటుంది. మార్క్సిస్టుల మహాసభల క్రతువు శ్రామికవర్గానికి ఆ స్పష్టత ఇవ్వడంలో విఫలమైంది.

-వుప్పల నరసింహం 99857 81799

(ఆంధ్రభూమి సౌజన్యం తో)