Home Hyderabad Mukti Sangram 15 మందిని క్రూరంగా హత్యచేసిన రజాకార్లు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-17)

15 మందిని క్రూరంగా హత్యచేసిన రజాకార్లు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-17)

0
SHARE

ఈ గ్రామం గుండా రక్షణ ఏర్పాట్లు చేసుకున్నదనే నేరంపై ఆ శిక్షను అధికారులు విధించారు. దాదాపు 15 మందిని క్రూరంగా హత్యచేసి సైన్యం దుమ్ములేపుకుంటూ వెళ్ళిపోయింది. వాతావరణం హాహాకారాలతో నిండిపోగా ఆకాశం మాత్రం “అల్లాహో అక్బర్‌”, “షాహే ఉస్మాన్ జిందాబాద్‌” అనే విజయనాదాలతో మార్మ్రోగింది. భైరవునిపల్లి ప్రజలకు నాయకత్వం వహించిన ఇమ్మడి రాజిరెడ్డి మాత్రం సజీవంగా మిగలడం ఆశ్చర్యకరమైన సంఘటన.

ఆ దారుణ హత్యాకాండ వివరాలను చెప్పడానికి ఈనాటికీ ఆ గ్రామంలోనే నిరాడంబరంగా జీవిస్తున్న రాజిరెడ్డిని నేను కలిసినప్పుడు ఆయన చెప్పిన వృత్తాంతం ఇది  దాడి జరుగబోయే ముందు రాత్రి ఇమ్మడి రాజిరెడ్డి తన చేను కాపలాకు వెళ్ళాడు. రాత్రి అక్కడే గడిపి ఉదయమే తిరిగి వస్తుండగా ఫిరంగి కాల్పుల చప్పుడు వినిపించింది. గ్రామంలోకి వెళదామంటే చుట్టూ ఉన్న నిజాం సైన్యం తనను సులభంగా కాల్చివేయగలదు. గత్యంతరం లేక అసహాయుడిగా తన కళ్ళముందే తన గ్రామం సర్వనాశనాన్ని చూస్తూ ఉండిపోయాడు. తాను మిగిలిపోవడం కేవలం దైవికమని అతని అభిప్రాయం.

నిజాం ప్రభుత్వంపై పోలీసుచర్య జరిగిన తర్వాత భైరవునిపల్లి ప్రజలకు ఆనాటి ప్రభుత్వం ఏదో కొంత చిన్న సహాయం చేసిందని కూడా ఆయన చెప్పాడు. నేను భైరవునిపల్లి గ్రామాన్ని చూసి అక్కడి బురుజును పరిశీలించాను. చిత్రకారుడు శ్రీ నరేంద్రరాయ్ సహాయంతో ఫోటోలు తీసుకొని గ్రామం వెలుపలికి వచ్చి మైదానంలో నిలబడ్డాను. సర్వీసు బస్సు కోసం వేచి ఉన్నాము. ఈ లోగా మైదానంలో నిలుచున్న నా దగ్గరికి ఒక గ్రామవాసి వచ్చి నమస్కరించాడు. ఆనాడు జరిగినదాడిలో తన తమ్ముడు సోమలింగం ప్రాణాలు కోల్పోయాడని, ఆనాటి బీభత్స దృశ్యాన్ని వర్ణించి చెప్పాడు.

ఒక మామూలు గ్రామవాసిగా తన అంతరంగాన్ని విప్పి చెబుతూ ఇలా అన్నాడు “ఇక్కడ ఈ మైదానంలో రక్తపుటేరు పారింది. అయినా ఈనాటికీ ఆ బలిదానానికి స్మృతిగా ప్రభుత్వం ఒక చిహ్నాన్ని కూడా స్థాపించలేదు. అందరూ మరిచపోయారు. ఆ దాడి జరిగిన తర్వాత నన్ను పోలీసులు ఏదో నేరంపై నాలుగున్నర సంవత్సరాలు జైల్లో పెట్టారు. (పోలీసు చర్య జరిగిన తర్వాత కూడా). మా ఊరి ప్రజలు నన్ను విడిపించడానికి చందాలు వసూలు చేస్తామని వస్తే నా స్వాభిమానం దెబ్బతిన్నది. పందిగా పది సంవత్సరాలు బ్రతికేకన్నా, నందిగా నాలుగు సంవత్సరాలు బ్రతకటం గౌరవమని మా వాళ్ళకు చెప్పాను” ఆ గ్రామస్థుని మనోబలాన్ని చూసి నోటమాట రాలేదు.

తిరుగు ప్రయాణంలో అనుకోకుండా జనగామ రైల్వే స్టేషన్‌లో ముస్త్యాల వాస్తవ్యుడైన శ్రీ కె. హన్మంతరెడ్డితో పరిచయం కలిగింది. ఆయన మిగతా వివరాలు చెప్పారు. భైరవునిపల్లి, లింగాపూర్ గ్రామాలపై జరిగిన రాక్షసదాడులను చూసి జనగామ ప్రజలు నిజాం ప్రభుత్వాన్ని విపరీతంగా అసహ్యించుకున్నారు. కాని నిజాం మాత్రం విదేశాల నుండి పత్రికా విలేఖరులను వేలరూపాలయలు ఖర్చుచేసి రప్పించి భైరవునిపల్లి సంఘటనలను మరోరకంగా వక్రంగా చిత్రించి విదేశాల్లో ప్రచారం చేశాడు. అసలు హిందువులే తిరగబడి దాడికి తలబడితే తాము శాంతి భద్రతలను కాపాడడానికి ఆ చర్య తీసుకున్నామని ప్రచారం చేశాడు. అయినా ప్రజల రక్తపాతం నిజాం అమానుష చర్యల నిజస్వరూపం ప్రపంచానికి బహిర్గతం కాక తప్పలేదు.

జనగామ రోడ్డు మధ్యనున్న ఒక చిన్న వంతెనను కూలగొట్టారు. కాని తర్వాత నిజాం పోలీసులు ఆ వంతెన కూలిన ప్రాంతం దగ్గర్లోనే ఉన్న అమాయకులైన తొమ్మిదిమంది రైతులను పొలాల్లో పనిచేస్తుండగా కాల్చివేశారు. వాళ్ళతో దారినపోతూ నుయ్యిలో నీళ్ళు తాగి నిలుచున్న ఒక చాకలి కూడా కాల్పులకు గురైపోయాడు. పోలీసులు శవాలను లాక్కెళ్ళి పొలాలలోనే గడ్డివేసి దహనం చేశారు. తమ తుపాకీ తూటాల వేడికి ప్రజల క్రోధం చల్లారిందని పోలీసులు భావించారు. కాని నిర్దోషులైన వేలాదిమంది ప్రజల రక్త ప్రవాహం నిజాం రాజ్యాన్ని కూలదోసింది. ఒక చిన్న వంతెనను కూల్చిన నేరానికి తొమ్మిదిమంది నిరపరాధులైన ప్రజల ప్రాణాలు విలువగట్టగలిగారో లేక ప్రజల రక్తం నిజాం నిరంకుశాధికారాన్ని శాశ్వతంగా సమాధిచేసి వేసిందో తర్వాత చరిత్రే నిరూపించింది.

(విజయక్రాంతి సౌజన్యం తో )