Home Telugu Articles జాతికి దిక్సూచి ‘ఏకాత్మ మానవతా వాదం’

జాతికి దిక్సూచి ‘ఏకాత్మ మానవతా వాదం’

0
SHARE

-ముదిగొండ శివప్రసాద్

యూరప్‌లోని ఆర్థిక, మత విధానాలపై సమకాలీన స మాజం నిరసన వ్యక్తం చేసింది. ఒక గనికి ఒక అధిపతి ఉంటాడు. అతని కింద వందమంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఈ కార్మికులకు ఎలాంటి ఆర్థిక వనరులు ఉండవు. కొద్దిమంది చేతుల్లో ఆర్థిక వనరులన్నీ కేంద్రీకరింపబడ్డాయి. వారు సమాజాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని తమ ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణమైన వారికే రాజ్యాధికారం కట్టబెట్టారు. దీనినే ‘పెట్టుబడిదారీ విధానం’ అన్నారు. కారల్ మార్క్స్ ఒక సంప్రదాయ యూదు కుటుంబంలో జన్మించాడు. ఆయనకు ఈ ఆర్థిక వ్యవస్థ వికృతంగా తోచింది. మత బోధకులు సమాజాన్ని మభ్యపెడుతున్నారని గ్రహించి ‘మతం ఒక మత్తుమందు’ అని అన్నాడు. పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యర్థిగా సామ్యవాద విధానం ప్రతిపాదింపబడింది. అమెరికా క్యాపిటలిజాన్ని, రష్యా కమ్యూనిజాన్ని ఎన్నుకున్నాయి. ప్రపంచాన్ని ఈ రెండు ఆర్థిక విధానాలూ ప్రభావితం చేశాయి.

ప్రపంచంలో భారత్ అత్యంత ప్రాచీనమైనది. ఇంతటి సువిశాల, పురాతన దేశానికి తనదైన సంస్కృతి, ఆర్థిక విధానం లేకపోతే ఇన్ని వేల సంవత్సరాలు ఎలా బతికి బట్టకట్టకలిగింది? అని కొందరు మేధావులు 20వ శతాబ్దంలో ఆలోచించారు. వారిలో పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రథముడు. ఆయన మధుర సమీపంలోని ఒక కుగ్రామంలో జన్మించారు. ఎంఎ చదువుకున్నారు. అప్పుడు జాతీయోద్యమం తీవ్రంగా సాగుతున్నది. ఉద్యమం ఫలించి ఇంగ్లీషు వారు వెళ్లిపోతారు సరే, అ సలు వీళ్లు ఇండియాకు ఎలా వచ్చారు? అని దీనదయాళ్ వంటి అతికొద్ది మంది మాత్రమే ఆలోచించారు. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతానికి ‘ఏకాత్మ మానవతా వాదం’ అని పేరు. ఆయన పూర్తిస్థాయి సామాజిక కార్యకర్తగా తననుతాను సమాజానికి సమర్పించుకున్నారు. ఆరోజుల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండేవి. వీటికి ప్రత్యామ్నాయం లేని దశలో శ్యాంప్రసాద్ ముఖర్జీ ‘భారతీయ జనసంఘ్’ను స్థాపించారు. దీనికి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా దీనదయాళ్ నియమితులయ్యారు. 1950వ దశకంలో వీరి ఆంగ్ల వ్యాసాలు న్యూఢిల్లీ నుండి వెలువడే ‘ఆర్గనైజర్’ ఆంగ్ల వారపత్రికలో ‘పొలిటికల్ డైరీ’ శీర్షికన వస్తుండేవి. దీనదయాళ్‌జీ ‘రాష్ట్ర ధర్మ’ పత్రికకు సంపాదకునిగా పనిచేశారు. అప్పట్లో జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వం ఒక వటవృక్షంలా వ్యాపించింది. వీరందరినీ కాదని ఒక కొత్తపార్టీ రావటం అంటే అది ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. ఈ అసంభవాన్ని దీనదయాళ్ తన సంఘటనా కౌశలంతో సుసాధ్యం చేశారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ కాశ్మీరులో హత్యకు గురికాగా, డాక్టర్ రఘువీర కారు ప్రమాదంలో మరణించారు. ఇలా జనసంఘ్ పార్టీకి ఎన్నో బాలారిష్టాలు ఏర్పడ్డాయి.

దీనదయాళ్ ఉపాధ్యాయ చాలా సాదాసీదాగా ఉండేవాడు. ఉపన్యాసం కూడా స్ఫూర్తిదాయకంగా ఉండేది కాదు. విశాఖపట్నంలో 1960లో వారి తొలి ప్రసంగం విన్నాను. 1962లో హైదరాబాదు వద్ద ఘటకేసర్‌లోని గురుకులంలో రెండు రోజుల ఏకాత్మతా శిబిరానికి ఆయన వచ్చారు. ఆయన వద్ద జత బట్టలు మాత్రమే ఉండేవి. వాటినే ఉతికి ధరిస్తూ ఉండేవారు. ఆయన తీసుకునే ఆహారం పరిమితంగా ఉండేది. ఒకసారి గుంటూరులో జూపూడి యజ్ఞనారాయణ ఇంటికి దీనదయాల్‌జీ వచ్చారు. వారికి ఒక గదిలో బస ఏర్పాటుచేశారు. భోజనానికి పిలుద్దామని యజ్ఞనారాయణ భార్య హైమవతి ఆ గదిలోకి వెళ్లేసరికి ఒక విచిత్రమైన దృశ్యం కన్పడింది. చినిగిపోయిన తన పంచెను దీనదయాల్‌జీ ఒక సూదితో కుట్టుకుంటూ ఉన్నారు. ఆమెకు కళ్లవెంట నీళ్లు తిరిగాయి. ఒక రాజకీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఇంతటి పేదరికాన్ని కోరి వరించటం ఆశ్చర్యకరమైన అంశమే. వెంటనే ఆమె ఒక జత కొత్తబట్టలు తెప్పించి ఆయనకు ఇచ్చి, వాటిని ధరిస్తే తప్ప మీరు భోజనం చేయడానికి వీలులేదని అన్నారు. ఆయన చిరునవ్వుతో అంగీకరించి కొత్తబట్టలు ధరించి భోజనం చేశారు. భోజనానంతరం ఆ కొత్త బట్టలను వీధిలోని ఒక బిచ్చగాడికి దానం చేశాడు. ‘ఇదేమిటి?’ అని యజ్ఞనారాయణ ప్రశ్నించగా- ‘నాకు ఒక చినిగిన పంచె అయినా ఉంది. ఆ బిచ్చగాడికి అదీలేక గోచీ పెట్టుకున్నాడు..’ అన్నారాయన.

దీనదయాల్‌జీ ప్రతిపాదించిన సిద్ధాంతం ఎంతటి ఆధునికమో అంతటి పురాతనం. అది వేదోపనిషత్ సారం. మానవునికి ప్రకృతిపరమేష్టికీ మధ్యగల సంబంధాన్ని నిర్వచిస్తుంది. వ్యక్తి సమష్టి సృష్టి పరమేష్టి ఇవన్నీ ఒకే అఖండ మండలాకార చక్రంలో అంతర్భాగాలు. మనిషికి – పక్షికి- పశువుకు- చెట్లకు- పంచభూతాలకు ఒక అనుబంధం ఉంది. పరస్పర ఆశ్రమబంధం ఉంది. ప్రకృతి మానవ లక్షణం, సంస్కృతి దైవీ లక్షణం. మానవుడు మహామానవుడుగా ఎదగవలసి ఉంది. ఆర్థిక సంబంధాల గూర్చి దీనదయాల్‌జీకి స్పష్టమైన అవగాహన ఉంది. వారు దేశీయమైన ఆర్థిక వ్యవస్థను ప్రతిపాదించారు. అర్థ వికాసానికి ధర్మం కేంద్ర బిందువు. ధర్మం అంటే మతం కదా. మతం వైయక్తికం. ధర్మం శాశ్వతం. వ్యక్తికి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలున్నట్లే దేశానికీ పంచకోశాలుంటాయి. వ్యక్తికి ప్రాణం ఉన్నట్లే ప్రతి దేశానికి ‘విరాట్’ అనే ప్రాణశక్తి ఉంటుంది. అది లుప్తమైనప్పుడు ఆ దేశం విచ్ఛిన్నమవుతుంది. ఇందుకు మనం ఇండో-పాక్ విభజనను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇజ్రాయిల్‌కు రెండు వేల సంవత్సరాల స్వతంత్ర దేశం లేదు కాని ప్రాణశక్తి సజీవంగా ఉంది. అందువల్ల 1948లో ఇజ్రాయిల్ ఒక దేశంగా ఏర్పడినా ఒక స్వతంత్ర జాతిగా సత్వరంగా అభివృద్ధి చెందగలిగింది. దీనదయాల్ ఆర్థిక విధానాల మీద దత్తోపంత్ ఠేంగ్డే వంటివారి భాష్యాలు లోగడ వచ్చాయి. తెలుగులో పలువురు రచయితలు ఆయన జీవనం సిద్ధాంతాలపై గ్రంథాలు వెలువరించారు.

1968 కేరళలోని కోజికోడ్‌లో భారతీయ జన సంఘ్ అఖిల భారత మహాసభలు జరిగాయి. అప్పుడు జాలరి గుడిసెల మీద కూడా జనసంఘ్ జెండాలు ఎగిరాయి. దీనిని కమ్యూనిస్టులు భరించలేకపోయారు. 1968 ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం యుపిలోని మొగల్‌సరాయ్ రైల్వేస్టేషన్‌లో దీనదయాల్‌జీ హత్యకు గురయ్యారు. ఈ పని రష్యా ప్రేరేపిత ఉగ్రవాదులు చేయించారన్న అనుమానాలు చెలరేగాయి. అట్టడుగువర్గాల అభ్యున్నతే దేశప్రగతి అని ఆయన భావించారు. దీనికి ‘అంత్యోదయ’ అని పేరు. ఇది కేవలం ఆర్థిక వికాసమే కాదు, సామాజిక సర్వాంగణ వికాసం. వ్యక్తికి శరీరం ఉన్నట్లే ప్రతి సంస్కృతికి తనదైన ఒక దేశం ఉంటుంది. ఆ విధంగా చూస్తే భారతదేశంలో ఎన్నో భాషలు, వేషాలు, ఆహార, ఆచార వ్యవహారాలు వేరువేరుగా కన్పడుతున్నా అనాదిగా ఒకే సాంస్కృతిక ప్రవాహం ఉన్నట్లు గమనింపవచ్చు. ఇది భిన్న సంస్కృతుల కలగూరగంప అనే వాదాన్ని దీనదయాల్‌జీ అంగీకరించలేదు. భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఫెడరలిజం ద్వారా విశృంఖల స్వేచ్ఛ పెరిగితే అది కేంద్ర అధికారాన్ని ధిక్కరించే స్థాయికి చేరుతుందని గ్రహించారు. ఇప్పుడు మనం బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో ఈ ధోరణిని చూస్తున్నాము.

ఇక ఓటరుకు, భారతీయుడికి కొంత తేడా ఉంది. ఓటరు ఐదు నిమిషాలు ఆలోచించి ఒకరిని ఎన్నుకొని పోలింగ్ బూత్‌నుండి వెళ్లిపోతాడు. కాని భారతీయత ఆజీవనవ్రతం అని దీనదయాల్‌జీ అభిప్రాయపడ్డారు. స్వదేశీ ఉద్యమం ద్వారా ఆర్థిక, సామాజిక రంగాల్లో స్వావలంబన అవసరం అని దీనదయాల్‌జీ భావించారు. మతం వైయక్తికమే కాని రాజధర్మం కాదు. ఒక వ్యక్తి బౌద్ధుడైనా, శైవుడైనా, ముస్లిమైనా, క్రైస్తవుడైనా అతడు ‘హిందువే’నని దీనదయాల్‌జీ ప్రతిపాదించారు. ఇండియాలోని ముస్లిములు, క్రైస్తవులు కూడా హిందువులేనని ఆయన విశాల నిర్వచనం. ఒక వ్యక్తి మతం మార్చుకున్నంత మాత్రాన భారత జాతీయ సంస్కృతినుండి ఎందుకు దూరంగా పోవాలి? అబ్దుల్ కలాం కర్నాటక సంగీతాన్ని ఆస్వాదించి రామేశ్వరం కోవెలలో సేవలు అందించలేదా? 1947లో దేశ విభజనను దీనదయాల్‌జీ వ్యతిరేకించారు. చైనావల్ల ముప్పు పొంచి ఉందని ఆయన 1950వ దశకంలోనే గుర్తించారు. ‘సమస్త దేవీదేవతల స్థానంలో భరతమాతను ప్రతిష్టాపించండి’ అని స్వామి వివేకానంద ఇచ్చిన పిలుపును దీనదయాల్‌జీ అందిపుచ్చుకున్నారు. వారి కఠోర పరిశ్రమలో సంయుక్త విధాయక దళ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఆయన ఎట్టి రాజకీయ అధికారాన్ని ఆశించకుండా భారతమాత పాదాలవద్ద పూజా కుసుమంగానే మిగిలిపోయారు. నెహ్రూ గారి ‘కాంపోజిట్ కల్చర్’ సిద్ధాంతం రష్యాపై ఆధారపడటం దీనదయాల్‌జీకి నచ్చలేదు. అయినా ఆయన నెహ్రూను వ్యక్తిగతంగా నిందించలేదు. కమ్యూనిస్టులు మాత్రం దీనదయాల్‌జీ ప్రగతిని అడుగడుగునా అడ్డుకున్నారు. కారణం ఆయన ‘భారత జాతీయవాదాన్ని’ ప్రతిపాదించటం.

పండిత దీనదయాల్‌జీ 1916లో జన్మించారు. వారి శతజయంతి ఉత్సవాన్ని నిర్వహించాలని, వారి సిద్ధాంతాలను పాఠ్యగ్రంథాలలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి చాలామంది మేధావులు లేఖలు రాసినా ఎలాంటి స్పందన లేదు. ఆయనకు ఇంతవరకూ ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించక పోవడం సమంజసం కాదు. ‘భారతరత్న’ను గత ప్రభుత్వాలు రాజకీయ కోణంలో కొందరికి మరణానంతరం ప్రకటించాయి. దేశం కోసం పనిచేయని వారికి కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఆ అవార్డును ప్రకటించిన సందర్భాలున్నాయి. అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు చేత దోషిగా నిర్ధారింపబడిన దివంగత జయలలితకు ‘భారతరత్న’ ప్రకటించాలని ఇటీవల తమిళనాడు శాసనసభలో తీర్మానం చేయడం విడ్డూరం. ఎంజిఆర్, సచిన్ టెండూల్కర్‌లకు ‘భారతరత్న’ ఇచ్చారు. నేతాజీ సుభాష్‌చంద్ర బోస్, అల్లూరి సీతారామరాజు, పివి నరసింహారావు వంటి నేతలు ‘భారతరత్నాలు’ కాదా? అసాధారణ ప్రజ్ఞను గుర్తించి కొంతమంది సాధారణ వ్యక్తులకు ఈ ఏడాది మోదీ ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలు ఇచ్చింది. కర్మయోగి, త్యాగశీలి అయిన దీనదయాళ్‌కు మోదీ హయాంలోనైనా ‘భారతరత్న’ వస్తుందా?

దీనదయాళ్ ప్రతిపాదించి ఒక వాదం కాదు, అది ఒక మానవ వేదం. ఒక స్వతంత్ర జాతికి ఇది ‘మేనిఫెస్టో’ వంటిది. దీనిపై ఇంకా విస్తృత పరిశోధనలు జరుపవలసి ఉంది. మానవుణ్ణి కేంద్ర బిందువుగా చేసుకొని, అతడి ‘సర్వాంగణ’ వికాసం కోసం ‘ఏకాత్మ మానవతావాదం’ ఒక దార్శనిక దృష్టితో ఆవిష్కరింపబడింది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం నాడైనా దీనదయాళ్‌కు ‘భారతరత్న’ను ప్రకటిస్తే ఆయన శతజయంతి ఉత్సవాలకు సార్థకత చేకూరినట్లే.

This article was first published in 2020