ధైర్యం పుంజుకున్న జిహాదీల మిత్రులు, పాకిస్తాన్ తొత్తులు జమ్మూ కశ్మీర్‌లో భద్రతాదళాలపై రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు శుక్రవారం ప్రసార మాధ్యమాలలో మరోసారి ఆవిష్కృతమయ్యాయి. ఇలా ఈ దేశద్రోహులు ధైర్యం పుంజుకొనడానికి కారణం కశ్మీర్‌లోయ ప్రాంతంలోని కొందరు రాజకీయ వేత్తలు, వారికి మద్దతుగా చేస్తున్న ప్రకటనలు! భద్రతాదళాలపై రాళ్లు రువ్వుతున్న వారు దేశద్రోహులని సైనిక దళాల ప్రధాన అధికారి జనరల్ విపిన్ రావత్ వ్యాఖ్యానించడం పట్ల ‘నేషనల్ కాన్ఫరెన్స్’- ఎన్‌సి- వంటి కశ్మీర్ ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకులు నిరసన తెలిపారు. ఇలా నిరసనలు తెలపడం వల్ల రాళ్లు రువ్వుతున్న వారికి మరింత ధైర్యం రావడం సహజం. ఈనెల పదునాలుగవ తేదీన రాళ్లు రువ్విన దుండగులు ‘జిహాదీ ఉగ్రవాదులు’ అప్రమత్తం కావడానికి సహకరించారు. అలా అప్రమత్తమైన జిహాదీలు అనేకమంది తప్పించుకొని సురక్షిత స్థానాలకు తరలిపోయారు. మరికొందరు మన భద్రతాదళాలపైకి విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఫలితంగా ఒక ‘మేజర్’ సహా నలుగురు సైనికులు బలైపోయారు. నలుగురు జిహాదీ బీభత్సకారులను మట్టుపెట్టగలిగినప్పటికీ మన జవానులు ఇలా బలైపోవడానికి ప్రధాన కారణం ‘రాళ్లు రువ్వుతున్నవారు’. ఉత్తరలోయ ప్రాంతంలోని బందిపురా వద్ద ఈ ఘటనలు జరిగాయి. ఉగ్రవాదులు నక్కిఉన్న ఇళ్లను, ఇతర ప్రదేశాలను పసికట్టిన భద్రతాదళాల వారు ఆ దిశగా వెడుతున్న సమయంలో దేశ వ్యతిరేక నినాదాలు చేసిన దుండగులు రాళ్లు రువ్వారు. ఈ రాళ్లవాన ద్వారా భద్రతాదళాల దృష్టిని మళ్లించడం దుండగుల లక్ష్యం. దేశ వ్యతిరేక నినాదాల హోరు వల్ల నక్కిఉన్న పాకిస్తాన్ ప్రేరిత బీభత్సకారులు అప్రమత్తమై పోతున్నారు. అందువల్లనే రాళ్లు రువ్వుతున్న వారు దేశ విద్రోహులని, జాతి వ్యతిరేకులని మన సైనిక దళాల ప్రధాన అధికారి రావత్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యానం కశ్మీర్‌లోయ ప్రాంతంలో దశాబ్దుల తరబడి కొనసాగుతున్న దేశ వ్యతిరేక కుట్ర గురించి దేశ ప్రజలలో మరోసారి ధ్యాసను పెంచింది. సైనికులపై రాళ్లురువ్వే వారు, టెర్రరిస్టులకు సహకరించేవారు దేశ ద్రోహులన్నది మన దేశంలోనే కాదు అన్ని దేశాల్లోను తరతరాల వాస్తవం. మన ఇంటికి నిప్పు పెడుతున్న వారికి సహకరించే వారు ఇంటికి ద్రోహులు. దేశాన్ని బద్దలుకొట్టడానికి ప్రయత్నిస్తున్న బీభత్సకారులకు సహకరించే వారు, బీభత్సకారులను ప్రతిఘటిస్తున్న సైనికులపై, భద్రతాదళాలపై రాళ్లు రువ్వేవారు దేశానికి ద్రోహులు. ఈ సహజ సత్యాన్ని సైనిక దళాల ప్రధాన అధికారి మరోసారి చెప్పాడంతే..
రాళ్లు రువ్వుతున్న దుర్జనులు, దేశవ్యతిరేకులు కాదన్నది ‘జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్’, ‘హురియత్’ వంటి దేశవ్యితిరేకులు చేస్తున్న వాదం. అందువల్లనే ‘హురియత్’ ‘ముదురు’ ముఠా నాయకుడు సయ్యద్, ‘మెతక’ ముఠానాయకుడు ఉమర్ ఫారూక్, ‘జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్’ నాయకుడు యాసీన్ మాలిక్ వంటివారు జనరల్ విపిన్ రావత్ ప్రకటనతో విభేదించడం సహజం. ఎందుకంటే ఈ ముఠాల వారు జమ్మూ కశ్మీర్‌ను మన దేశం నుంచి విడదీయడం తమ లక్ష్యమని బాహాటంగానే ప్రకటించి ఉన్నారు. ఈ వికృత లక్ష్యాన్ని సాధించడానికి ‘జిహాద్’ను జరుపుతున్న పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకారులను, వారికి మద్దతుగా భద్రతాదళాలపై రాళ్లు రువ్వే స్థానికులను ‘హురియత్’ తదితర ముఠాలవారు బలపరచడం సహజం. ఈ ముఠాల వారు భారత రాజ్యాంగం పట్ల విధేయతను, భారత జాతీయ సమైక్య సర్వ సత్తాక అధికారం పట్ల నిబద్ధతను, దేశ భౌగోళిక సమగ్రత పట్ల నిష్ఠను ప్రకటించడానికి బహిరంగంగానే నిరాకరిస్తున్నారు. ఇలా నిరాకరిస్తున్న వారిని నిర్బంధించి న్యాయస్థానాల్లో విచారించి శిక్షించకపోవడం కేంద్ర ప్రభుత్వం వారి దశాబ్దుల వైఫల్యం, జాతీయ వైపరీత్యం! కానీ మన రాజ్యాంగం పట్ల నిబద్ధతను ప్రకటించిన జమ్మూ కశ్మీర్ భారత్‌లో భాగమన్న వాస్తవాన్ని అంగీకరించిన ‘నేషనల్ కాన్ఫరెన్స్’ వంటి రాజకీయ పక్షాల వారు సైతం సైనిక దళాల ప్రధాన అధికారి వ్యాఖ్యలను నిరసించడం, వ్యతిరేకించడం మరింత ప్రమాదకరం. ‘నేషనల్ కాన్ఫరెన్స్’ రాజ్యాంగ ప్రక్రియలో 1947 నుంచి కూడ భాగస్వామి. ఈ పార్టీకి చెందిన షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా అనేక ఏళ్లపాటు కశ్మీర్ ముఖ్యమంత్రులు. అయినప్పటికీ ‘రా ళ్లు రువ్వుతున్నవారు’ దేశద్రోహులు కారని ఈ పార్టీ నాయకులు, ప్రతినిధులు ప్రకటించడం విస్మయకరం!
ప్రస్తుతం భాజపాతో కలసి జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న ‘పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ’- పిడిపి- వారు కూడ రాళ్లు రువ్వతున్న ముష్కరులను సమర్థించడం చరిత్ర. భాజపాతో కలసి ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నందున ‘పిడిపి’వారు ‘రాళ్లు రువ్వే మూకల’ను బహిరంగంగా సమర్థించడం లేదు. కానీ రాళ్లు రువ్విన దుండగులపై అభియోగాలను రద్దు చేయాలని, వారిని జైళ్ల నుంచి విడుదల చేసి ఉపాధి కల్పించాలని ‘పిడిపి’ వారు గతంలో కోరారు. కేంద్రంలో 2004- 2014 సంవత్సరాల మధ్య మన్‌మోహన్ సింగ్ ప్రధానమంత్రిత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేసింది. ఆ సమయంలో దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖను కొంతకాలం నిర్వహించిన పళనియప్పన్ చిదంబరం జమ్మూ కశ్మీర్ ‘ప్రశాంతి కోసం ప్రగతి కోసం’ అష్టసూత్ర ప్రణాళికను ఆవిష్కరించాడు. రాళ్లు రువ్విన వారిని క్షమించి జైళ్ల నుంచి విడుదల చేసి, వారికి వ్యతిరేకంగా దాఖలైన అభియోగాలను రద్దు చేయాలన్నది ఈ ఎనిమిది సూత్రాలలో ఒకటి.. ఫలితంగా రాళ్లు రువ్వి వందలాది సైనికులను గాయపరచిన ‘జిహాదీ’ సమర్థక దేశద్రోహులు జైళ్ల నుంచి విడుదలైపోయారు. కేంద్ర ప్రభుత్వం వారి భారీ ఆర్థిక సహాయాలను అందుకొని తిని తెగబలిసిన ఈ ‘కుర్రాళ్లు’ ఇప్పుడు మళ్లీ సైనికదళాలపై, కేంద్ర రిజర్వ్ పోలీసులపై, ఇతర భద్రతాదళాలపై రాళ్లు రువ్వుతున్నారు. చిదంబరం పథకాన్ని నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్ డెమొక్రటిక్ పార్టీ సమర్థించడం చరిత్ర!
రాళ్లు రువ్వుతున్న వారిని క్షమించి వదలిపెట్టి ఉపాధి కల్పించిన చిదంబరం పథకం ఇలా బెడిసికొట్టింది. కశ్మీర్‌లోయ ప్రాంతంలోని స్థానికులు టెర్రరిస్టులకు మద్దతునిస్తున్నారని విపిన్ రావత్ ప్రకటించడానికి ఇదంతా నేపథ్యం. బీభత్స వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహించకుండా స్థానికులు అడ్డుతగలడం మాత్రమే కాదు, పాక్ ప్రేరిత బీభత్సకారులు తప్పించుకొని పోవడానికి సైతం ఈ స్థానికులు సహకరిస్తున్నారని రావత్ ప్రకటించడం కశ్మీర్‌లోయలో నెలకొన్న ప్రమాదకరమైన దుస్ధితికి నిదర్శనం. ఈ ప్రమాదం కారణంగానే శరణార్థి శిబిరాల్లోని కశ్మీరీ హిందువులు లోయ ప్రాంతానికి తిరిగి వెళ్లడానికి భయపడుతున్నారు.
(ఆంధ్రభూమి సౌజన్యంతో)