Home English Articles పండిత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ – భారతీయ జాతీయవాదం

పండిత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ – భారతీయ జాతీయవాదం

0
SHARE

మనీష్ మోక్షగుండం

పండిత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ (సెప్టెంబర్ 25, 1916 – ఫిబ్రవరి 11, 1968) ఒక భారతీయ తత్వవేత్త, ఆర్థికవేత్త, సామాజిక శాస్త్రవేత్త, చరిత్రకారుడు, పాత్రికేయుడు, రాజకీయ కార్యకర్త. ప్రస్తుత భారతీయ జనతా పార్టీకి ముందున్న భారతీయ జనసంఘం ముఖ్య నాయకులలో ఆయన ఒకరు. సంపూర్ణ మానవీయతకు ఆయన ఒక దిక్సూచి, ఆయన ఒక సిద్ధాంతకర్త, పరిపాలన, రాజకీయాల ప్రత్యామ్నాయ నమూనాకు మూలం.

ఆయన కేవలం మాటల మనిషి కాదు, చెప్పినది తాను ఆచరించి చూపే ఆదర్శ స్వయంసేవకుడు, కార్యనిర్వాహకుడు, సామాజిక చింతకుడు, ఆర్థికవేత్త, విద్యావేత్త, రాజకీయవేత్త, రచయిత, జర్నలిస్ట్ , వక్త. పండిత దీన్‌దయాళ్ జీవితం పరోపకార ధర్మపు నిజమైన ఆచరణ, అలాగే సనాతన సాంప్రదాయం, భారతీయ సాంస్కృతిక విలువల ప్రతిబింబం.

భారతీయ జాతీయవాద ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం దీనదయాళ్ జీ. రాజకీయాల్లో భారతీయ విలువలకు ఆయన ఒక ఆదర్శ ప్రతినిధి. స్వాతంత్ర్యం తరువాత రాజకీయ శూన్యత తొలగించాల్సిన అవసరాన్ని గుర్తించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ద్వితీయ సర్ సంఘచాలక్ గురూజీ గోల్వాల్కర్ ఆ బాధ్యతను దీనదయాళ్ జీ కి అప్పగించారు. జాతీయవాద రాజకీయ పార్టీ అయిన భారతీయ జన సంఘ్, 1951 లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రారంభించినప్పుడు సంస్థాగత నిర్మాణం కోసం దీనదయాళ్ గారినే నియమించారు.

ప్రజాస్వామ్యం, పాలనకు సంబంధించిన పాశ్చాత్య భావనలను భారతీయం చేయడంలో గొప్ప నైపుణ్యం, అవగాహన చూపిన దీనదయాళ్ ఉపాధ్యాయ పశ్చిమాన ప్రజాస్వామ్యపు ప్రాథమిక సిద్ధాంతాలు పెట్టుబడిదారీ విధానానికి ప్రతిచర్య అని అభిప్రాయపడ్డారు. కనుక వేదాలు, పురాణాలు, ధర్మ శాస్త్రాలు ఇతర సాంస్కృతిక జ్ఞాన వ్యవస్థల నుండి జాతీయవాద నైపుణ్యాన్ని భారతీయ సూత్రాలను అనుసరించాలని ఆయన సూచించారు.

మలుపు
దీనదయాళ్ జీ 1937 లో కాన్పూర్ లోని సనాతన్ ధర్మ కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు, తన సహధ్యాయి బలూజీ (బల్వంత్) మహాషాబ్డే ద్వారా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తో పరిచయం కలిగింది. అక్కడ ఆయన ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవర్ (డాక్టర్‌జీ) ను కలిశారు, ఇది దీన్‌దయాల్జీ జీవితంలో ఒక మలుపు . డాక్టర్‌జీ అదే హాస్టల్‌లో ఉండేవారు. సంఘ్ మేధోపరమైన ప్రేరణతో దీనదయాళ్ జీ ఎంతగానో ఆకర్షితులైయ్యారు. తన కళాశాల జీవితమంతా ఆర్‌ఎస్‌ఎస్‌ పనిలో నిమగ్నమయ్యారు.

దీనదయాళ్ జీ ప్రయాగ్ నుండి బిటి డిగ్రీని సంపాదించారు. అయినా ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకున్నారు. అప్పుడే నాగ్‌పూర్‌లోని 40 రోజుల ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. తరువాత 1942 నుండి ఆర్‌ఎస్‌ఎస్‌లో పూర్తి సమయం పనికి తనను తాను అంకితం చేసుకున్నారు.

పాత్రికేయునిగా
దీనదయాళ్ జీ రాష్ట్ర ధర్మ, స్వదేశ్, ఆర్గనైజర్, పాంచజన్య వంటి పత్రికలలో తన రచనల ద్వారా జాతీయ ఆలోచనవిధానానికి బీజాలు జల్లారు. ఆయన ప్రసిద్ధ వ్యాసాలు ‘పొలిటికల్ డైరీ’ తరువాత అత్యధికంగా అమ్ముడైన పుస్తకం గా ప్రచురించబడింది.
దీనదయాళ్ జీ 1940 లో లక్నోలో ‘రాష్ట్ర ధర్మ ప్రకాశం’ అనే ప్రచురణ సంస్థ స్థాపించారు. తను నమ్మిన సూత్రాలను ప్రచారం చేయడానికి ‘రాష్ట్ర ధర్మం’ అనే మాస పత్రికను ప్రారంభించారు. ఈ పత్రిక ఏ సంచికలోనూ ఆయన పేరు సంపాదకుడిగా ముద్రించబడనప్పటికీ, ఆలోచనను రేకెత్తించే రచనల ద్వారా ఎంతో ప్రభావాన్ని చూపారు.

జర్నలిస్టుల కోసం ఆయన సందేశం స్పష్టంగా ఉంది, “వార్తలను వక్రీకరించవద్దు”. దీన్ని వివరించడానికి ఇక్కడ ఒక కధ ఉంది; 1961 లో రైల్వే ఉద్యోగులు జాతీయ సమ్మెకు పిలుపునిచ్చారు, జన సంఘ మద్దతు ఇచ్చింది , కాని పాంచజన్య పత్రికలో మాత్రం సమ్మె ని విమర్శిస్తూ వ్యాసం వచ్చింది . దాంతో కాంగ్రెస్ పత్రిక నవజీవన్ జనసంఘ నాయకులపై వ్యంగ్య దాడికి దిగింది. ప్రధాన కార్యదర్శిగా జోక్యం చేసుకుని దీనదయాళ్ జీ తన ప్రకటనతో సమస్యను పరిష్కరించారు ” పార్టీ ప్రయోజనాల కోసం చెయ్యాల్సిన ఏదైనా కార్యక్రమం, దేశ ప్రయోజనాలకు అడ్డు అనుకుంటే , అప్పుడు ఏమి చేయాలి? సమ్మెకు మద్దతు ఇవ్వడానికి పార్టీకి తప్పనిపరిస్థితి ఉండవచ్చు, కాని పాంచజన్యకు అలాంటి అనివార్య కారణాలు ఉండకూడదు. ప్రతి ఒక్కరూ తమ స్థానంలో సరైన నిర్ణయం తీసుకున్నారని నా అభిప్రాయం. పార్టీలు సమాజం లేదా దేశం కంటే పెద్దవి కావు. జాతీయ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక జర్నలిస్ట్ దేశానికి విధేయుడిగా ఉండాలి. ” అని స్పష్టం చేశారు.

పుస్తక రచయిత
దీనదయాళ్ జీ “చంద్రగుప్త మౌర్య” అనే నాటకాన్ని కూడా వ్రాసారు. శంకరాచార్యుల జీవిత చరిత్రను హిందీలో వ్రాసారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గెవార్ జీవిత చరిత్రను మరాఠీ నుండి హిందీకి అనువదించారు. ఆయన రచనలు సామ్రాట్ చంద్రగుప్తుడు (1946), జగత్గురు శంకరాచార్య (1947), అఖండ్ భారత్ క్యో?, రాష్ట్ర చింతన్, ఏకాత్మ మానవవాదం, రాష్ట్ర జీవన్ కి దిశా మొదలైనవి.

రాజ ధర్మ నిపుణుడు
“ధర్మం తన శక్తిని ఉపయోగిస్తుంది. జీవితంలో ధర్మం ముఖ్యం. ధర్మ రక్షణ చెయ్యాలని, తన ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి ధర్మాన్ని వ్యాప్తి చేయాలని సమర్ధ రామదాస స్వామి శివాజీ మహారాజుకు బోధించారు. తన రాజ్యాన్ని విస్తరించడానికి శివాజీని ప్రేరేపించారు; ఎందుకంటే రాజ్యం సమాజంలో ఒక ముఖ్యమైన సంస్థ. ” – పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ

స్వతంత్ర దేశంగా భారతదేశం వ్యక్తివాదం, ప్రజాస్వామ్యం, సోషలిజం, కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం మొదలైన పాశ్చాత్య భావనలపై ఆధారపడలేదని ఆయన నమ్మకం. ఈ దేశం అభివృద్ధి చెందాలని ఆయన కోరుకున్నా అది బ్రిటిష్ వారు వదిలిపెట్టిన పాశ్చాత్య భావనలపై కాదనే స్పష్టమైన అవగాహన ఆయనకు ఉంది. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే భారతదేశంలో ప్రజాస్వామ్యం స్థాపించబడినప్పటికీ, సుదీర్ఘ బానిసత్వం తరువాత దేశపు తీరుతెన్నులు ఎలా ఉంటాయోననే సందేహం ఆయనలో ఉండేది. పాశ్చాత్య సిద్ధాంతాలు, భావజాలాలవల్ల భారతీయ మేధస్సు దెబ్బతింటుందని ఆయన భావించారు. సమర్ద నాయకత్వం వల్లనే ఈ దేశంమళ్లీ ఊపిరి పీల్చుకుంటుందని ఆయనకు ఖచ్చితంగా తెలుసు. అందుకనే అసలైన భారతీయ ఆలోచన పెరుగుదల, విస్తరణ కోసం ఎంతో కృషి చేశారు.

దీనదయాళ్ జీ నిర్మాణాత్మక విధానాన్ని విశ్వసించారు. ప్రభుత్వం సరైనది అయినప్పుడు సహకరించాలని, తప్పు జరిగినప్పుడు నిర్భయంగా వ్యతిరేకించాలని ఆయన తన అనుచరులను ప్రోత్సహించారు. కాలికట్ సమావేశాల్లో ఆయన ఇచ్చిన సందేశం ఇప్పటికీ వారి చెవుల్లో మోగుతుంది:
“మనం ఏ ప్రత్యేక సమాజం లేదా విభాగం కాదు, మొత్తం దేశపు సేవకు ప్రతిజ్ఞ చేస్తున్నాము, ప్రతి దేశస్థుడు మన రక్తంలో రక్తం, మాంసంలో మాంసం. ప్రతి ఒక్కరూ తాము భరతమాత సంతానమని గర్వించగలిగేంతవరకు విశ్రాంతి తీసుకోము . భారత దేశాన్ని నిజంగా సుజలాం, సుఫలాం (స్వచ్చమైన నీటితో ప్రవహించే, పండ్లతో నిండిన దేశం) గా చేస్తాము . భరత మాత దశ ప్రహరణ ధారిణి దుర్గ (ఆమె 10 ఆయుధాలు ధరించిన దేవత దుర్గ), ఆమె చెడు పై విరుచుకు పడే దుర్గ ; లక్ష్మిగా ఆమె సమృద్ధిని అందజేయగలదు, సరస్వతిగా ఆమె అజ్ఞానపు చీకటిని పోగొట్టి జ్ఞాన ప్రకాశాన్ని వ్యాప్తి చేస్తుంది. అంతిమ విజయంపై విశ్వాసంతో, ఈ పనికి మమ్మల్ని అంకితం చేద్దాం ”.

ఏకాత్మ మానవ దర్శన్

“మన దేశంలో ఏ విదేశీ సిద్ధాంతాన్ని యధాతధంగా స్వీకరించడం సాధ్యం కాదు లేదా తెలివైనది కాదు. ఇతర సమాజాలలో, గత లేదా ప్రస్తుత పరిణామాలను పూర్తిగా విస్మరించలేము అలా విస్మరించడం కూడా ఖచ్చితంగా అవివేకం”
– పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ

దీనదయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవవాదాన్ని ప్రతిపాదించారు. ఇందులో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి: 1) రాజకీయాల్లో నైతికత; 2) స్వదేశీ.

“సమగ్ర మానవతావాదం తప్పనిసరిగా భారతీయ మరియు పాశ్చాత్య భావజాలాల గురించి సమతుల్య అంచనా వేయాలి. ఈ మూల్యాంకనం ఆధారంగా, మనిషి తన ప్రస్తుత ఆలోచన, అనుభవం, సాధించిన స్థానం నుండి మరింత పురోగతి సాధించే మార్గాన్ని చూపించడానికి ప్రయత్నిస్తాడు. పాశ్చాత్య ప్రపంచం గొప్ప భౌతిక పురోగతిని సాధించింది, కానీ ఆధ్యాత్మిక సాధన రంగంలో అది పెద్దగా ముందుకు సాగలేదు. భౌతిక శ్రేయస్సు లేకుండా ఆధ్యాత్మిక మోక్షం ఉండదు. అందువల్ల, మనం బలం, భౌతిక ఆనందం కోసం కృషి చేయడం అవసరం, తద్వారా మనం జాతీయ ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతాము, ప్రపంచ పురోగతికి దోహదం చేయగలము. అందువల్ల మన కార్యక్రమం వాస్తవికతలో ఉండాలి.”

ఒక యుగం ముగిసింది

దీనదయాళ్ జీది దేశానికి అంకితమైన జీవితం. 11 ఫిబ్రవరి 1968 న, మొఘల్సరై స్టేషన్ యొక్క రైల్వే ట్రాక్లలో ఆయన మృతదేహం కనబడింది. ఆ తరువాత ఆయన పార్ధివదేహాన్ని ఢిల్లీ తీసుకు వచ్చినప్పుడు ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ గురూజీ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. సాధారణంగా గంభీరంగా, స్థితప్రఙతతో ఉండే గురూజీ కూడా దీనదయాళ్ జీ మృతదేహాన్ని చూసినప్పుడు నీళ్ళు నిండిన కళ్ళ తో, గద్గదమైన స్వరంతో ఇలా అన్నారు –
“నాకు కుటుంబం లేదు అందుకే ఈ బాధను సరైన పదాలతో చెప్పలేను. నాకు ఈ పవిత్ర ఆత్మతో అనుబంధం వివరించలేనిది. అయితే దేవుడు తనకు ప్రియమైన వ్యక్తులను తొందరగా పిలుచుకు వెళతాడు”.
అటల్ బిహారీ వాజ్‌పేయి తన మనోభావాలను ‘మేము సవాలును అంగీకరిస్తున్నాము’ అనే వ్యాసం ద్వారా వ్యక్తీకరించారు. అందులో ఆయన ఇలా వ్రాశారు:
“ఆయనపై దాడి మన జాతీయవాదంపై దాడి. ఆయన శరీరంపై గాయాలు మన ప్రజాస్వామ్యానికి తగిలిన దెబ్బలు. దేశ వ్యతిరేక, ప్రజాస్వామ్య శత్రువుల ఈ సవాలును మేము స్వీకరిస్తున్నాము ”

అనువాదం: చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి

Source : arise bharath.Org

This article was first published in 2019